Contempt Of Court : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని విధంగా తీవ్ర గందరగోళం, డ్రామా చోటుచేసుకుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా.. స్వయంగా వాదనలు వినిపించడానికి లిటిగెంట్-ఇన్-పర్సన్ గావచ్చిన ఒక వ్యక్తి కోర్టు హాల్లో వీరంగం సృష్టించాడు. న్యాయమూర్తులపైకి కేసు ఫైళ్లను విసిరేయడమే కాకుండా, బహిరంగ కోర్టులోనే జడ్జీలను ఉద్దేశించి తీవ్రమైన బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అతడిని కోర్టు హాలు నుంచి బలవంతంగా బయటకు లాగేశారు. నేను సార్వభౌముడిని.. మిమ్మల్ని ఆదేశిస్తున్నా! : పిటిషనర్ వింత ప్రవర్తన
జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ వింత పరిణామం వెలుగుచూసింది. కోర్టు విచారణ ప్రారంభం కాగానే, ప్రబల్ ప్రతాప్ అనే సదరు పిటిషనర్ కనీస చట్టపరమైన వాదనలు వినిపించకుండా అత్యంత దూకుడుగా మాట్లాడటం ప్రారంభించాడు. మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్ .. ఉత్తరప్రదేశ్ లక్నో ఏసీపీపై, డూప్లెక్స్ టెక్నాలజీస్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. ఎందుకంటే నేను సార్వభౌముడిని " అంటూ జడ్జీలకే హుకుం జారీ చేశాడు. షాకైన జడ్జీలు.. కోర్టు హాల్లో ఫైళ్ల వర్షం!
పిటిషనర్ ప్రవర్తనకు ధర్మాసనం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. నువ్వు మమ్మల్ని ఆదేశిస్తున్నావా? అని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. దానికి సదరు వ్యక్తి.. నా వైపు నుంచి చెప్పాల్సింది అంతే, అంతా రికార్డుల్లో ఉంది అంటూ తన చేతిలోని కేసు ఫైళ్ల కట్టను గాల్లోకి విసిరేశాడు. ఆ కాగితాలన్నీ కోర్టు హాల్లో జడ్జీల మీదుగా చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతటితో ఆగకుండా, భారత ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి కూడా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించాడు.
బలవంతంగా ఈడ్చేసిన సెక్యూరిటీ..
కోర్టు హాల్లో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అక్కడ ఉన్న సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది వెనువెంటనే స్పందించారు. జడ్జీలపైకి దూసుకుపోకుండా అతడిని గట్టిగా పట్టుకుని, నియంత్రించి.. కోర్టు గది నుండి వెలుపలికి నెట్టేశారు. కోర్టు హాల్లో ఉన్న న్యాయవాదులు, ఇతర లిటిగెంట్లు ఈ హఠాత్పరిణామాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. పెద్ద మనసు చాటుకున్న ధర్మాసనం
సాధారణంగా కోర్టు ధిక్కరణ లేదా న్యాయమూర్తులపై దాడికి ప్రయత్నిస్తే కఠినమైన జైలు శిక్షలు విధిస్తారు. అయితే, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సదరు వ్యక్తిపై ఎలాంటి కఠిన చర్యలకు లేదా కోర్టు ధిక్కరణ చర్యలకు నిరాకరించి పెద్ద మనసు చాటుకుంది. అతడిపై మేం ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకోవడం లేదు. ఆ పిటిషనర్ పట్ల మాకు కేవలం సానుభూతి మాత్రమే ఉంది అని జస్టిస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. అనంతరం కేసు రికార్డులను పరిశీలించి, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణాలు లేవంటూ సదరు స్పెషల్ లీవ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
