Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Telangana Police Constable Case: పెళ్లికి ముందు సంబంధాలు పెట్టుకుంటే ఉద్యోగం నిరాకరించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థి గాజుల తిరుపతి కేసులో కీలక తీర్పు ఇచ్చింది.

Telangana Police Character Verification Rules: పెళ్లికి ముందు యువతీ యువకులు పరస్పర అంగీకారంతో పెట్టుకునే శారీరక సంబంధాలు నేరం కాదని, అది వారి వ్యక్తిగత జీవితానికి ఎలాంటి 'బ్లాక్ మార్క్' కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పులో స్పష్టం చేసింది. సమాజంలో వస్తున్న మార్పులను నియామక సంస్థలు గమనించాలని, గతంలో జరిగిన వ్యక్తిగత గొడవలు లేదా బ్రేకప్‌లను సాకుగా చూపి అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయకూడదని కోర్టు హితవు పలికింది. తెలంగాణకు చెందిన ఒక యువకుడి పదేళ్ల సుదీర్ఘ పోరాటానికి న్యాయం చేకూరుస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.
కానిస్టేబుల్‌గా ఎంపికైన గాజుల తిరుపతి
తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే యువకుడికి 2014లో పోలీస్ ఆఫీసర్ కావాలనే పెద్ద కల ఉండేది. అదే సమయంలో అతను నివసించే ప్రాంతంలోని ఒక యువతితో ప్రేమాయణం సాగించాడు. అయితే కొన్ని కారణాల వల్ల వారి బంధం తెగిపోయింది. దాంతో ఆ యువతి, తిరుపతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇందులో ఎలాంటి లైంగిక దాడి ఆరోపణలు లేవు. ఆ తర్వాత 2015లో ఇరువర్గాలు లోక్ అదాలత్‌ను ఆశ్రయించి, పరస్పర అవగాహనతో ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుని కేసును ముగించాయి.
కొన్నేళ్ల తర్వాత తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తిరుపతి కష్టపడి చదివి పరీక్షలన్నింటిలోనూ ఉత్తీర్ణుడై ఉద్యోగానికి ఎంపికయ్యాడు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫామ్‌ను భర్తీ చేసే సమయంలో తిరుపతి అత్యంత నిజాయితీగా వ్యవహరించాడు. 2014లో తనపై నమోదైన కేసు వివరాలను, అది లోక్ అదాలత్‌లో ఎలా పరిష్కారమైందో అంతా స్పష్టంగా పేర్కొన్నాడు. ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మాత్రం దీనిపై కఠినంగా వ్యవహరించింది. పెళ్లి నిశ్చయించుకుని తప్పుకోవడం అంటేనే నైతిక ప్రవర్తన సరిగ్గా లేకపోవడమేనని భావిస్తూ, అతని ఎంపికను రద్దు చేసింది.
సమస్య పరిష్కరించుకున్నా ఉద్యోగం నిరాకరణ
తన కల చెదిరిపోవడంతో తిరుపతి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. సింగిల్ జడ్జి అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, బోర్డు అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ ఆ తీర్పును రివర్స్ చేసింది. అభ్యర్థి అర్హతను నిర్ణయించే తుది హక్కు ప్రభుత్వానిదేనని పేర్కొంది. దీంతో తిరుపతి చివరగా సుప్రంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసును నిశితంగా పరిశీలించి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకోవడం అంటే నేరాన్ని అంగీకరించినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, బోర్డు ఆలోచనా విధానం ఆధునిక సమాజానికి ఆమడ దూరంలో ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలంలో పెళ్లికి ముందు ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో బంధాన్ని కొనసాగించడం సర్వసాధారణమని, ఆ బంధం పెళ్లి వరకు వెళ్లనంత మాత్రాన అభ్యర్థి నైతిక ప్రవర్తన చెడ్డదని ముద్ర వేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. యజమానులకు ఉద్యోగులను ఎంపిక చేసుకునే హక్కు ఉన్నప్పటికీ, అది పక్షపాతంతో లేదా అన్యాయంగా ఉండకూడదని స్పష్టం చేసింది.
తిరుపతికి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశం
పదేళ్ల క్రితం ఆ యువతే స్వయంగా కేసును ఉపసంహరించుకున్నందున, తిరుపతి చట్టాన్ని ఉల్లంఘించాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. తిరుపతిపై ఉన్న ఆరోపణలను తొలగిస్తూ, అతనికి వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని రిక్రూట్‌మెంట్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక వ్యక్తి గతాన్ని, వ్యక్తిగత సంబంధాలను సాకుగా చూపి ప్రభుత్వ ఉద్యోగాన్ని నిరాకరించే హక్కు ఎవరికీ లేదని ఈ చారిత్రాత్మక తీర్పు ద్వారా స్పష్టమైంది.
ట్రెండింగ్ వార్తలు






















