Nallamala Sagar Telangana petition:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 'పోలవరం-నల్లమలసాగర్' అనుసంధాన ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్రం ఉపసంహరించుకుంది. రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తినప్పుడు నేరుగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం కంటే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేయడం సరైన మార్గమని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రాజెక్టు ఇంకా ప్లానింగ్ దశలోనే ఉన్నందున, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందా అని న్యాయస్థానం ఇరు రాష్ట్రాలను ప్రశ్నించింది. ప్రస్తుతానికి స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ అంశంపై చర్చలు జరపవచ్చని సూచించింది. దీంతో రిట్ పిటిషన్‌ను తెలంగాణ వెనక్కి తీసుకుంది.  

Continues below advertisement

నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్ట్ చేపడుతోందన్న తెలంగాణ       

గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన  పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రబిందువైంది. పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచి, సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమలోని నల్లమలసాగర్  వరకు తరలించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి బేసిన్‌లో తమకు కేటాయించిన నీటి వాటాకు విఘాతం కలుగుతుందని, ఇది 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డుకు మరియు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Continues below advertisement

వృథాగా సముద్రంలోకి పోతున్న నీరు మాత్రమే వాడుకుంటున్నామన్న ఏపీ      

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలో భాగంగా... సముద్రంలోకి వృథాగా పోతున్న సుమారు 3000 టీఎంసీల గోదావరి వరద జలాల నుంచి కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నామని స్పష్టం చేసింది. దిగువ రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకునే హక్కు తమకు ఉందని, కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించడమే తమ ప్రాథమిక లక్ష్యమని   బృందం పేర్కొంది. అవసరమైన అన్ని చట్టపరమైన, పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని, ఇప్పుడు కేవలం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి మాత్రమే టెండర్లు పిలిచామని ఏపీ కోర్టుకు తెలిపింది.       

రిట్ పిటిషన్ వెనక్కి తీసుకుని సివిల్ సూట్ ఫైల్ చేయనున్న తెలంగాణ                       

తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ ఏకపక్షంగా పనులు చేపడుతోందని ఆరోపి స్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మౌలిక డిజైన్ ప్రకారం మాత్రమే పూర్తి చేయాలని, ఇలాంటి విస్తరణ పనుల వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని వాదిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఈ లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని తెలంగాణ తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇరు రాష్ట్రాల వాదనలతో తదుపరి విచారణలో సివిల్ సూట్ ఫైల్ చేసే అంశంపై తెలంగాణ తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంది.