Chandrababu letter: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
Chandrababu Naidu letter: ఏప్రిల్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు, జగన్‌కు లేఖ రాశారు. మిత్రపక్షాలతో పాటు విపక్ష నేతలకూ లేఖలు రాశారు.

Chandrababu Naidu letter to all party leaders including Jagan: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు,నియోజకవర్గాల పునర్విభజన అంశం తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన రాజకీయ సమీకరణానికి తెరలేపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ వైరం పక్కనపెట్టి.. జగన్‌కు చంద్రబాబు లేఖ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప్పు-నిప్పులా ఉండే చంద్రబాబు, జగన్ మధ్య లేఖ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌కు లేఖ రాశారు. సాధారణంగా కేంద్రం ప్రవేశపెట్టే ఏ బిల్లుకైనా అడగకముందే మద్దతు ఇచ్చే జగన్, ఇప్పుడు చంద్రబాబు నేరుగా కోరడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇది కేవలం మహిళా సాధికారతకు సంబంధించిన అంశం మాత్రమే కాకుండా, దీని వెనుక డిలిమిటేషన్ అనే అతిపెద్ద రాజకీయ చిక్కుముడి ఉండటమే దీనికి ప్రధాన కారణం.
చంద్రబాబు లేఖతో జగన్ డైలమా
చంద్రబాబు లేఖ రాయడం ద్వారా బంతిని జగన్ కోర్టులోకి విసిరారు. ఒకవేళ జగన్ ఈ బిల్లుకు మద్దతు ఇస్తే, అది చంద్రబాబు అభ్యర్థనను మన్నించినట్లు అవుతుందనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. అలాకాకుండా, డిలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని స్టాలిన్ లాంటి నేతల బాటలో నడిచి మద్దతు ఉపసంహరించుకుంటే.. జగన్ తన రాజకీయ విధానాన్ని మార్చుకున్నట్లు అవుతుంది. మహిళా రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తే అది మహిళా ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందనే భయం కూడా ఉంది. చంద్రబాబు తన లేఖలో మహిళల భాగస్వామ్యాన్ని నొక్కిచెప్పడం ద్వారా, ఈ అంశాన్ని పూర్తిగా అభివృద్ధి కోణంలోకి మళ్ళించారు. దీనివల్ల ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించడాన్ని మహిళా వ్యతిరేక చర్యగా చిత్రీకరించే అవకాశం చంద్రబాబుకు లభిస్తుంది.
మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’కు పార్లమెంట్లో మద్దతుపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు ఈరోజు లేఖ రాశాను. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు మద్దతు… pic.twitter.com/9T3i1LKXQZ
— N Chandrababu Naidu (@ncbn) April 14, 2026
చారిత్రక ఘట్టం.. ఏప్రిల్ 16పై అందరి దృష్టి
ప్రధాని మోదీ సంకల్పించిన ఈ నారీ శక్తి వందన్ బిల్లుతో లోక్‌సభ స్థానాల సంఖ్య 850కి పెరిగే అవకాశం ఉండటంతో, దేశ రాజకీయ చిత్రపటమే మారిపోనుంది. పురుషుల సీట్లు తగ్గకుండానే 270 మంది మహిళలకు అవకాశం దక్కే ఈ క్రతువులో ఏపీ ఎంపీల పాత్ర అత్యంత కీలకం. జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి వంటి నేతలందరికీ చంద్రబాబు లేఖలు రాయడం ద్వారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకమవ్వాలని ఒక సూక్ష్మమైన రాజకీయ సందేశాన్ని పంపారు. ఏదేమైనా, ఒకప్పుడు పరస్పరం విమర్శించుకున్న నేతలు ఇప్పుడు ఒక జాతీయ విధానంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
ట్రెండింగ్ వార్తలు


















