Rajinikanth: హీరోగా తన తొలి చిత్రం పేరు భైరవి అని సూపర్ స్టార్ రజినీ కాంత్ అన్నారు. పాతాళ భైరవి సినిమా గుర్తుకు వచ్చి తాను హీరో పాత్రకు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ దుర్యోదనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రభావం తనపై చాలా ఉందని.. గద పట్టుకొని ఎన్టీఆర్ ను తాను అనుకరించేవాడినని వివరించారు. అయితే తాను బస్ కండక్టర్ గా పని చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన ఏవో కార్యక్రమాల్లో తాను కురుక్షేత్రం నాటకంలో పాల్గొన్నట్లు చెప్పారు. అయితే ఇందులో దుర్యోదనుడి పాత్ర వేసి అచ్చం ఎన్టీఆర్ ను అనుకరించానని.. ఇది చూసిన తన స్నేహితులు నువ్వు నటుడివి అయితే బాగుంటుందని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొనే తాను సినిమాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్ క్రమశిక్షణ పాటిచేవారని రజినీ కొనియాడారు. దానవీర శూర కర్ణలో ఎన్టీఆర్ లా తాను ఉండాలనుకున్నానని.. ఆయనలా మేకప్ వేసుకొని ఫొటో దిగి తన స్నేహితుడికి చూపించానని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఫొటో చూసిన తన స్నేహితుడు అచ్చం కోతిలా ఉన్నావంటూ కామెంట్ చేశాడని వివరించారు.
తాను ఎన్టీఆర్ తో కలిసి రెండు చిత్రాల్లో నటించినట్లు రజినీ కాంత్ తెలిపారు. అందులో ఒకటి తెలుగు చిత్రం టైగర్ అని రెండోది మణ్ణన్ వాణి (నిండు మనిషి) అనే తమిళ సినిమా అని వివరించారు. అలాగే ఎన్టీఆర్ ను చూసే తాను ప్రొడ్యూసర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకున్నానని.. కష్టపడి పని చేయడం కూడా నేర్చుకున్నానని వివరించారు. 13 ఏళ్లప్పుడు లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను చూశానని వ్యాఖ్యానించారు. ఓసారి ఎన్టీఆర్ వచ్చినప్పుడు చూడడానికి వెళ్తే ఎవరో నన్ను ఎత్తుకుని ఆయన్ని చూపించారు.. 18 ఏళ్లప్పుడు స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేశా.. ఆ తర్వాత 1977లో ఆ మహానుభావుడితోనే కలిసి టైగర్ సినిమా చేశాననని గుర్తు చేసుకున్నారు. దానవీర శూరకర్ణ ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు.. ఎన్టీఆర్‌ది ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. అప్పట్లో దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు.. మహామహులను ధీటుగా ఎదుర్కున్నానని అన్నారు. రజనీ కాంత్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారని చంద్రబాబు అన్నారు. రజనీకాంత్‌కు విదేశాల్లోనూ వీరాభిమానులు ఉన్నారన్నారు. ఉన్నతమైన వ్యక్తులు ఎలా ప్రభావితం చేస్తారో రజనీకాంత్ చెప్పారన్నారు. అందరూ రజనీకాంత్ ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుంది : రజనీకాంత్
అలాగే చంద్రబాబు విజన్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ అవుతుందన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు 30 ఏళ్లుగా స్నేహితుడన్నారు. ఆయన హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.