Strict measures to prevent Indigo like crises in the future: ఇండిగో సంక్షోభం వల్ల లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఇలాంటివి ఇక ముందు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆజ్‌తక్ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంక్షోభం ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించిందని.. దీన్ని ఓ కేస్ స్టడీగా తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ గత వారంలో తీవ్ర సంక్షోభానికి గురైంది. దాదాపు 1,600 ఫ్లైట్లు అకస్మాత్తుగా రద్దు అయ్యాయి. ఇది లక్షలాది ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. ఈ సంక్షోభానికి కారణం ఇండిగో వైఫల్యమేనని మంత్రి స్పష్టంచేశారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు ఇండిగో అనుగుణంగా పనిచేయలేదని, ఇది పైలట్లు, క్రూ మెంబర్లు, ప్రయాణికులకు సమస్యగా మారిందన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)తో రెండు రోజుల ముందు ఇండిగో ప్రతినిధులు సమావేశమై, FDTL సమస్యలు లేవని హామీ ఇచ్చారు. కానీ రెండు రోజుల్లోనే సమస్య తీవ్రం అయింది అని మంత్రి తెలిపారు. అంటే ఇండిగో సమస్యలను దాచి పెట్టిందని తెలిపారు. ఇండిగో వల్ల ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం, ప్రయాణికుల అసౌకర్యం ఏర్పడ్డాయి.
మంత్రి రామ్ మోహన్ నాయుడు తనపై వస్తున్న విమర్శను తిప్పికొట్టారు. ఇండిగో ప్లానింగ్ లేకపోవడం, , FDTL నిబంధనలకు ఉల్లంఘనలే ఈ సంక్షోభానికి కారణం. మేము రోజూ ఇండిగో ఆపరేషన్లు పరిశీలించాలా అని ప్రశ్నించారు. రెగ్యులేటర్‌గా సురక్షా ప్రమాణాలు నిర్ధారించడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. FDTL నిబంధనలు పైలట్లు, క్రూ, ప్రయాణికుల భద్రత కోసమే. మేముభద్రత గురించే ఆలోచిస్తాం అని స్పష్టం చేశారు. ఇండిగో ప్రభుత్వాన్ని మోసం చేసిందా లేదా అన్నదానిపై దర్యాప్తు జరుగుతోందన్నారు.ల ఇది ప్రభుత్వం, ఎయిర్‌లైన్ మధ్య యుద్ధం కాదు, ప్రయాణికుల సమస్య అని స్పందించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగితే.. తీవ్ర చర్యలు తప్పవని ఇండిగో సీఈవోకు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రభుత్వం ఈ సంఘటనపై వెంటనే చర్యలు ప్రారంభించింది. DGCAతో ఇండిగో సమావేశాలు జరిగినప్పటికీ సమస్యలు దాచిపెట్టినట్టు అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ మొత్తం విషయంపై పరిశోధన ప్రారంభించామని. ఎలా జరిగింది, ఎందుకు రిపోర్ట్ చేయలేదో తెలుసుకుంటామని మంత్రి ప్రకటించారు. రాతపూర్వకంగా విచారణ జరుగుతుందని, ఆపరేషన్లు స్థిరపడే వరకు పరిశీలిస్తామని తెలిపారు. ఇతర ఎయిర్‌లైన్‌లు FDTL నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని, ఇండిగో మాత్రమే ఉల్లంఘించిందని నొక్కి చెప్పారు. మంత్రి రామ్ మోహన్ నాయుడు, ఇలాంటి సంక్షోభాలు మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. FDTL నిబంధనల అమలును మరింత కఠినతరం చేస్తామని, అంతా స్థాక్‌హోల్డర్లతో సంప్రదించి భద్రతా ప్రమాణాలు మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రయాణికులకు భద్రత, స్థిరత్వం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సంక్షోభం భారత విమానయాన రంగంలో నియంత్రణ పరిధిని ప్రశ్నార్థకం చేసింది. DGCA సురక్షా ప్రమాణాలు నిర్ధారించడమే, రోజువారీ ఆపరేషన్లు పరిశీలించడం కాదని మంత్రి వివరించారు. ప్రయాణికులు ఎయిర్‌లైన్‌లపై ఆధారపడి ఉన్నారని, ప్రభుత్వం వారిని రక్షించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండిగో ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించిందా అనే అనుమానాలు, బాధ్యతలపై చర్చలకు దారితీశాయి. ఈ సంఘటన భవిష్యత్తులో ఎయిర్‌లైన్‌ల అధికారికతను పెంచుతుందని అభిప్రాయాన్ని రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు.