Srisailam Accident: నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదం, బోల్తాపడ్డ టూరిస్ట్ బస్సు, 10 మందికి తీవ్రగాయాలు
Srisailam Accident: శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
Srisailam Accident: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దెయ్యాల మలుపు వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగండ గ్రామానికి చెందిన 20 మంది శ్రీశైలం దర్శనార్థం టూరిస్టు బస్సులో బయలు దేరారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారిట్ల గ్రామ సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులోని దెయ్యాల మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి చేతులు, కాళ్లు విరిగాయి. మరికొందరికి తలపై తీవ్రంగా దెబ్బలు తగిలాయి. రక్తమోడుతున్న క్షతగాత్రులను వాహనదారులు గమనించి స్థానికులకు సమాచారం అందించారు. వారిని హుటాహుటినా శ్రీశైలం సుండిపెంట ఆస్పత్రికి తరలించినట్లు ఏఈవో ఫనిదర్ ప్రసాదం వెల్లడించారు.
ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, డ్రైవర్ కు ఘాట్ రోడ్డులో బస్సును నడిపించే అనుభవం ఉందా, టైర్ పంక్చర్ కావడం వల్ల బస్సు అదుపు తప్పి బోల్తా పడిందా, ఎవరైనా అడ్డు వచ్చారా, ఎదురుగా ఎవరైనా రావడంతోనే బస్సు అదుపు తప్పిందా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై నల్లగుట్టపల్లి పంచాయతీ కొత్తపల్లి క్రాస్ వద్ద ఏప్రిల్ 15వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైఎస్‌ఆర్ జిల్లా బద్వేలుకు చెందిన పెనమాల లక్ష్మమ్మ(65) పక్షవాతంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి బంధువులు కారులో తీసుకెళ్తున్నారు. కొత్తపల్లి క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో కారును వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మమ్మతో పాటు వారి కుమారుడు నర్సయ్య (41), కారు డ్రైవర్ రాజారెడ్డి (35) ఘటనాస్థలిలోనే చనిపోయారు. కారులో ఉన్న బంధువులు చిన్నక్క(60), మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కడప రిమ్స్ కు తరలించారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నక్క చనిపోయింది. రాయచోటి నుంచి కడప వెళ్తున్న మరో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
మరుసటి రోజే కడపలో రోడ్డు ప్రమాదం
కడప శివారుల్లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-కర్నూలు జాతీయ రహదారిపై పాలెంపల్లె రాచిన్నాయ పల్లె బైపాస్ రోడ్డులో వేగంగా వస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మృతులు చెన్నూరుకు చెందినవారు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన చెన్నూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.