Nara Lokesh Anantapur Aerospace Park: భారతదేశంలోని స్పేస్-టెక్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దక్షిణాది రాష్ట్రాల మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక అపూర్వమైన వ్యూహాత్మక యుద్ధం నడుస్తోంది. ప్రముఖ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ పిక్సెల్ కో-ఫౌండర్ క్షితిజ్ ఖండేల్వాల్ చేసిన ఒకే ఒక్క పోస్ట్.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పారిశ్రామిక మంత్రుల మధ్య హైవోల్టేజ్ పోటీకి తెరలేపింది.
ఒక్క ట్వీట్ – మూడు రాష్ట్రాల అలర్ట్
బెంగళూరు శివార్లలో తమ ఉపగ్రహాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భూమిని సేకరించడం ఎంత నరకంగా మారిందో వివరిస్తూ పిక్సెల్ కో-ఫౌండర్ క్షితిజ్ ఖండేల్వాల్ X లో ఒక పోస్ట్ పెట్టారు. భూమిని సేకరించడం కంటే.. అసలు అంతరిక్షంలోకి వెళ్లే ఉపగ్రహాలను తయారు చేయడమే చాలా సులభం అనిపిస్తోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. బెంగళూరు లాంటి గ్లోబల్ టెక్ హబ్‌లో భూసేకరణ, అనుమతుల ప్రక్రియల్లో ఉన్న రెడ్-ట్యాపిజం ను ఈ ట్వీట్ ఎత్తిచూపడంతో పొరుగు రాష్ట్రాలు దీనిని ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకున్నాయి.
నారా లోకేష్ అనంతపూర్ స్మార్ట్ ఆఫర్
ఈ పోస్టుపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత వేగంగా స్పందించారు. "క్షితిజ్.. బెంగళూరుకు సరిగ్గా ఆనుకుని, ఇన్వెస్టర్లకు స్వర్గధామం లాంటి అనంతపురం జిల్లా మన పక్కనే ఉంది. అక్కడ మేము స్పేస్ సిటీలు, ఏరోస్పేస్ పార్కులు, రెడీ-టు-గో ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్స్‌ను సిద్ధం చేస్తున్నాం. ఫౌండర్లు భూమి కోసం వేటాడుతూ సమయం వృథా చేసుకోకుండా నేరుగా ఉపగ్రహాల తయారీపై దృష్టి పెట్టవచ్చు. వెల్‌కమ్ టు ఏపీ" అంటూ లోకేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీనికి మద్దతుగా ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ కూడా కర్ణాటకను టార్గెట్ చేస్తూ.. "కొన్ని ఎకోసిస్టమ్స్ మిమ్మల్ని అనుమతుల కోసం ఆఫీసుల చుట్టూ పరిగెత్తేలా చేస్తాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ మీకు నేరుగా లాంచ్ ప్యాడ్ అందిస్తుంది" అంటూ హాట్ కామెంట్స్ జోడించింది.
డిఫెన్స్‌లో కర్ణాటక – అలర్ట్ అయిన మంత్రి ఎంబీ పాటిల్
సొంత రాష్ట్రంలోని స్టార్టప్ పొరుగు రాష్ట్రానికి తరలిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ వెంటనే రంగంలోకి దిగారు. క్షితిజ్ పోస్టుకు రిప్లై ఇస్తూ.. "నా ఆఫీస్ మరియు అధికారులు తక్షణమే మీతో టచ్‌లోకి వస్తారు. మీ సమస్యలను వ్యక్తిగతంగా సమీక్షించి, భూసేకరణ మరియు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తాం" అని హామీ ఇచ్చారు. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ట్యాగ్‌ను కాపాడుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది.
తమిళనాడు ఎంట్రీ – బ్యూరోక్రసీపై మంత్రి కీర్తన పవర్‌ఫుల్ పంచ్
ఈ బెంగళూరు-ఆంధ్ర వివాదంలోకి తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన అనూహ్యంగా ప్రవేశించారు. హోసూర్ సరిహద్దులో ఉన్న తమిళనాడు ఎందుకు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకోకూడదని నెటిజన్లు ప్రశ్నించడంతో ఆమె అత్యంత హుందాగా, పవర్‌ఫుల్ కౌంటర్ ఇచ్చారు. తాము గైడెన్స్ తమిళనాడు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ వెబ్‌సైట్, X, లింక్డ్‌ఇన్, ఈమెయిల్ లేదా కేవలం ఒక చిన్న రెఫరల్.. ఇలా ఏ మార్గంలో క్వెరీ పంపినా, చిన్న ఎంట్రప్రెన్యూర్‌ను కూడా సమానంగా, అత్యంత సీరియస్‌గా తీసుకుంటామని చెప్పారు.
పెట్టుబడుల కోసం ఆరోగ్యకరమైన పోటీ
భారతదేశంలో ఒకప్పుడు పెట్టుబడుల కోసం ఫౌండర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఈరోజు, ఒక స్టార్టప్ ఫౌండర్ పెట్టిన చిన్న అసంతృప్తి ట్వీట్‌కు ముగ్గురు రాష్ట్రాల మంత్రులు పోటీ పడి మరీ నిమిషాల వ్యవధిలో పరిష్కారాలు చూపడం భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో వచ్చిన విప్లవాత్మక మార్పుకు నిదర్శనం. ల్యాండ్ అక్విజిషన్ , రెడ్-ట్యాపిజం వంటి పాత కాలపు అడ్డంకులను తొలగించి, ఇన్వెస్టర్లకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కల్పించడంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సాగుతున్న ఈ ఆరోగ్యకరమైన పోటీ దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.
