Sleep Divorce:  ఏంటీ మీరిద్దరివి వేర్వేరు రూములు.. వేర్వేరు మంచాలా అని.. కొత్తగా పెళ్లి అయిన కూతురి కాపురాన్ని పరిశీలించేందుకు వచ్చిన తల్లి ఆశ్చర్యంగా కుమార్తెను అడుగుతుంది. అవునని తాపీగా సమాధానం చెబుతుంది ఆ కొత్త పెళ్లికూతురు.ఇది కొన్నాళ్ల క్రితం వచ్చిన పెళ్లైన కొత్తలో అనే సినిమాలో సీన్. ఇలా వేర్వేరుగా పడుకోవడాన్ని స్లీప్ డివోర్స్ అంటారని ఇప్పుడే బయటకు తెలిసింది.  అంతే కాదు ఇలా విడివిడిగా పడుకునే జంటలు మన దేశంలో 78 శాతం వరకూ ఉన్నాయట. 

వేర్వేరుగా నిద్రపోవడానికి భారతీయ జంటల ప్రాధాన్యత      

భార్యాభ‌ర్త‌లు గా బాగానే ఉంటారు కానీ..  రాత్రయ్యే సరికి ఎవరి గదులు వారు చేరిపోతున్నారు. అంత వెసులుబాటు లేకపోతే ఎవరి మంచం  వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. భాగస్వామి గురక దగ్గర నుంచి ఇలా విడివిడిగా పడుకోవడానికి చాలా కారణాలు చెబుతున్నారు.    స్ట్రెస్‌, యాంగ్జైటీ నుంచి దూరంగా ఉండటానికి..ప్ర‌శాంతంగా నిద్ర‌పోవ‌డానికి విడిగా నిద్రపోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీన్నే స్లీప్ డివోర్స్ అంటున్నారు.  ప్ర‌పంచంలోనే ఇలా స్లీప్ డివోర్స్ పాటిస్తున్న‌ది మ‌న ద‌గ్గ‌రే ఎక్కువ‌ని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఒక్క మన దేశమే కాదు..  చైనా (67%), ద‌క్షిణ కొరియా (65%)తో  పాటు అమెరికా, బ్రిట‌న్‌లో స‌గం మంది భార్యాభ‌ర్త‌లు విడివిడిగానే నిద్రపోతున్నారు.      

అయినా శృంగార జీవితం చాలా బాగుందని అంటున్న జంటలు       

హవ్వ భార్యభర్తలు విడివిడిగా పడుకోవడమా అని మన పెద్దలు ఆశ్చర్యపోవచ్చు కానీ.. ఇలా చేయడం వల్ల  ఆరోగ్యం, సంబంధాలు మెరుగ్గా ఉంటాయ‌ని చెప్ప‌ేవాళ్లు కూడా ఉన్నారు. భాగస్వామి నిద్రలో పెట్టే  గుర‌క, బ‌లంగా శ్వాస తీసుకోవ‌డం, ఊపిరి తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డ‌టం సంద‌ర్భంగా వ‌చ్చే సౌండ్ త‌ట్టుకోలేక చాలా మంది డిస్ట్రబ్ అవుతున్నారు. నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల భాగస్వాముల మీద అసహనం వ్యక్తం చేస్తూంటారు. విడిగా పడుకోవడం వల్ల ఆ సమస్యలు ఉండట ంలేదని అంటున్నారు. అలాగే బెడ్‌పై ప‌డుకుని కూడా మొబైల్ ఫోన్ చూస్తూ ఉండ‌ేవారు కూడా పెరుగుతున్నారు.          

ప్రపంచవ్యాప్తంగా అదే ట్రెండ్ - మారుతున్న కాలం            

మరి శృంగార జీవితం మాటేమిటి అని కొంత మంది అనుకుంటారు. నిజానికి ఇలా కలసి పడుకుంటేనే శృంగార జీవితం బాగున్నట్లుగా కాదని..  త‌మ శృంగార జీవితం కూడా బాగుంద‌ని  ఇలా స్లీప్ డివోర్స్ పాటిస్తున్న వారు చెబుతున్నారు. అయితే  జీవిత భాగ‌స్వామితో ప‌డ‌క పంచుకుంటే ల‌వ్ హార్మోన్‌గా చెప్పే ఆక్సిటోసిన్ విడుద‌ల చేస్తుంద‌ని, అది డిప్రెష‌న్‌ను త‌గ్గించ‌డంతోపాటు యాంగ్జియిటీని, స్ట్రెస్‌ను దూరం చేస్తుంద‌ని అంటున్నారు. వాటి ఫ‌లితంగా జీవితం, స‌న్నిహిత సంబంధాలు సంతృప్తిక‌రంగా ఉంటాయ‌ని పేర్కొంటున్నారు. కానీ విడిగా పడుకోవడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది కాలంతో వస్తున్న మార్పు అనుకోవాలేమో ?