ప్లాస్టిక్ ప్రత్యామ్నాయలపై జీఎస్‌టీ తగ్గించాలి..


జులై 1 వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. ఏయే వస్తువులు ఈ కేటగిరీలోకి వస్తాయన్నదీ వివరించింది. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి ఓ విజ్ఞప్తి చేయనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా తయారయ్యే ఉత్పత్తులపై జీఎస్‌టీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తానని చెప్పారు గోపాల్ రాయ్. ఈ ప్లాస్టిక్‌కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇటీవలే ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగానే గోపాల్ రాయ్
ఈ విషయం వెల్లడించారు. అంతే కాదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరిధిలోకి ఏయే ఉత్పత్తులు వస్తాయన్న విషయంలో స్పష్టత ఇంకా రాలేదని
అన్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థలకూ ఈ అంశంలో క్లారిటీ లేదని వెల్లడించారు. ఈ నిషేధం అమలు చేసే క్రమంలో ప్రజల్లో ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉండకూడదని, అందుకే ఈ భేటీ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. నిషేధిత జాబితాలో లేని ప్లాస్టిక్‌ను వినియోగించటాన్నీ నిలువరిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. 


ప్రభుత్వం తరపున లేఖ రాస్తాం: దిల్లీ మంత్రి

ఈ సమావేశంలో చాలా మంది ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపైనే చర్చించారని, అయితే వాటిపై జీఎస్‌టీని తగ్గించాలని వారంతా ప్రతిపాదించారని
గోపాల్ రాయ్ తెలిపారు. అందుకు అనుగుమంగా ప్రభుత్వం తరపున కేంద్రానికి ఓ లేఖ రాస్తామని చెప్పారు. చాలా మంది ప్లాస్టిక్ బ్యాన్అనగానే కవర్లు నిషేధించారనే భావనలోనే ఉన్నారని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని అన్నారు. ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందించే పనిలో ఉన్నామని వెల్లడించారు గోపాల్ రాయ్. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం ఏంటి..? ఆ ఉత్పత్తులను ఎలా తయారు చేస్తారు..? లాంటి వివరాలు అందులో ఉండనున్నాయి. 


సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించే వారికి నోటీసులు అందిస్తామని స్పష్టం చేశారు. జులై 10వ తేదీ వరకూ ఇలా నోటీసులు ఇస్తామని, ఆ తరవాత కూడా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 1986 పర్యావరణ చట్టం ప్రకారం ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. లక్ష జరిమానా లేదా ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటంలో ప్రజలకు అవగాహన కల్పించటమే కాకుండా వాటి ప్రత్యామ్నాయాలేమిటో కూడా వివరిస్తామని తెలిపారు. కేంద్రం కూడా ఈ విషయంలో చాలా కఠినంగాఉంటామని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.