Shivpal Singh Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం జరిగింది. ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ తిరిగి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
మెయిన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్.. భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
విభేదాలు
అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య విభేదాలు తలెత్తి ఎన్నోసార్లు విడిపోయారు. కానీ ఇటీవలి కాలంలో ఇరువురు కాస్త దగ్గరయ్యారు. తాజాగా మెయిన్‌పురి ఎన్నికల్లో డింపుల్ యాదవ్‌ను గెలిపించమని శివపాల్ యాదవ్‌ను అఖిలేశ్ కోరారు. దీంతో కీలకమైన ఉప ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
శివపాల్ యాదవ్ 2018లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి విడిపోయారు. అఖిలేశ్ యాదవ్‌తో విభేదాల కారణంగా సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. 2017లో అఖిలేశ్ యాదవ్ ఎస్పీ పగ్గాలు చేపట్టిన తర్వాత శివపాల్ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
కలిసే ప్రచారం
ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానంలో అఖిలేశ్ తన భార్య డింపుల్ యాదవ్‌ను బరిలోకి దించారు. ఆమె గెలుపు కోసం బాబాయ్, అబ్బాయ్ కలిసే ప్రచారం చేశారు. ఈ స్థానానికి తొలుత అఖిలేశ్ బంధువు ధర్మేంద్ర యాదవ్ లేదా ఆయన మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలోకి దిగుతారని అంతా భావించారు. అయితే చివరకు డింపుల్ యాదవ్ పేరును ఖరారు చేశారు.
కంచుకోట
మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 1996లో ములాయం తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మరో మూడుసార్లు 2004, 2009, 2019లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 2014 ఉప ఎన్నికలో అఖిలేశ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సీటును గెలుచుకున్నారు. ములాయం సింగ్ లేకుండా సమాజ్‌వాదీ పార్టీ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక ఇదే.