Trains divirted in AP: మీరు ఈనెలలో ప్రయాణం పెట్టుకున్నారా..? రైల్లో వెళ్లాలని భావిస్తున్నారా..? ఇప్పటికే ట్రైన్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నారా...? అయితే ఇది మీకోసమే. ఆంధ్రప్రదేశ్ మీదుగా రైలు ప్రయాణం చేసేవారికి... దక్షిణ మధ్య రైల్వే  కీలక సూచన చేసింది. పలు రైల్వే లైన్‌లో జరుగుతున్న డబ్లింగ్‌ పనుల వల్ల.. కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు.. రైళ్ల మల్లింపు ఉంటుంది.. ప్రయాణికులు గమనించాలని సూచించింది.


ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు డివిజన్‌లో వర్క్‌ నడుస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గుంటూరు-గుంతకల్లు ప్రధాన రైలు మార్గంలో, బుగ్గానిపల్లి సిమెంట్‌నగర్-బేతంచెర్ల మధ్య 6.61 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులు యుద్ధప్రాతిపదిక  జరుగుతున్నాయి. దీంతో... ఆయా మార్గాల్లో నిత్యం రాకపోకలు సాగించే రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నెలాఖరు (మార్చి నెలాఖరు) వరకు పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది దక్షిణమధ్య రైల్వే. అంతేకాదు..  కొన్ని ట్రైన్లను దారి మళ్లించింది. 


ఈనెలాఖరు వరకు రద్దు చేసిన రైళ్ల వివరాలు...
గుంటూరు-సికింద్రాబాద్‌-గుంటూరు మధ్య తిరిగే 17253, 17254 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. అలాగే.. గుంటూరు నుంచి ద్రోణాచలం వెళ్లే 17227 నెంబర్‌ గల ఎక్స్‌ప్రెస్‌ రైలును  ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేశారు. ఇక.. గుంతకల్లు నుంచి ద్రోణాచలం వెళ్లే 07288 నెంబర్‌ గల ప్రత్యేక ప్యాసింజర్‌ రైలును ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశారు. ద్రోణాచలం-గుత్తి-ద్రోణాచలం మధ్య తిరిగే 07289, 07290  నెంబర్‌ గల ప్రత్యేక పాసింజర్‌ను కూడా ఈనెల 27 నుంచి 30 వరకు రద్దు చేశారు. ద్రోణాచలం నుంచి కర్నూలు వెళ్లే ప్రత్యేక ప్యాసింజర్‌ (07291), కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే ప్రత్యేక ప్యాసింజర్‌ (07499)ను ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు  రద్దు చేశారు. అలాగే... నంద్యాల నుంచి కర్నూలు వెళ్లే ప్రత్యేక ప్యాసింజర్‌ (07798), కర్నూలు సిటీ నుంచి గుంతకల్లు వెళ్లే ప్రత్యేక ప్యాసింజర్‌ (07292)ను.. ఈనెల 27 నుంచి ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేశారు. 


దారిమళ్లించిన రైళ్ల వివరాలు...
హౌరా నుంచి సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు వెళ్లే రైలును దారి మళ్లించారు. ఈనెల 27న బయల్దేరే హరా-సత్యసాయి ప్రశాంతి నిలయం వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ రైలు (22831)ను నంద్యాల, ఎర్రగుంట్ల, గుత్తి కోటల మీదుగా దారి మళ్లించారు. అలాగే  ఈనెల 29న... సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి హౌరా బయలుదేరే వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ రైలు (22832)ను, ఈనెల 29న పూరి నుంచి యశ్వంత్‌పూర్‌కు బయల్దేరే వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ రైలు (2283)ను కూడా నంద్యాల, ఎర్రగుంట్ల, గుత్తి కోటల  మీదుగా దారి మళ్లిస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 


గుంటూరు-గుంతకల్లు ప్రధాన రైలు మార్గంలో, బుగ్గానిపల్లి సిమెంట్‌నగర్-బేతంచెర్ల మధ్య డబ్లింగ్‌ పనులను... ఈనెలాఖరులోగా యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని... ఆ తర్వాత.. రద్దు చేసిన, దారి మళ్లించిన రైళ్లు యధాతథంగా నడుస్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు.. ప్రయాణికులు సహకరించాలని కోరారు.