Air India Delhi-Sydney Flight:


ఢిల్లీ-సిడ్నీ ఫ్లైట్‌లో..


ఢిల్లీ-సిడ్నీ ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ గాల్లో ఉండగానే ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే సమయానికే...మెడికల్ అసిస్టెన్స్ సిద్ధంగా ఉంచారు. ఎవరినీ ఆసుపత్రిలో చేర్చాల్సినంత తీవ్రంగా గాయాలు కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పష్టం చేసింది. 


"Air India B787-800 ఎయిర్‌క్రాఫ్ట్‌ గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది. దాదాపు ఏడుగురు ప్రయాణికులు ఈ ప్రమాదంలో స్పల్పంగా గాయపడ్డారు. ఫ్లైట్‌లో ఉండగానే వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఓ డాక్టర్‌తో పాటు నర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో వాళ్లకు చికిత్స చేశారు"


- డీజీసీఏ


గాయాలు తీవ్రంగా కాకపోయినా చాలా చోట్ల దెబ్బలు తాకినట్టు అధికారులు వెల్లడించారు. తీవ్రస్థాయిలో కుదుపులకు లోనవడం వల్లే ఇలా జరిగిందని వివరించారు. అయితే..ఇప్పటి వరకూ ఎయిర్ ఇండియా మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు. ఈ మధ్య కాలంలో ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌లు ఇలా ఏదో ఓ ప్రమాదానికి గురవుతున్నాయి. ప్రయాణికులను టెన్షన్ పెడుతున్నాయి.