Haryana IPS Officer Shoots Himself: హర్యానా క్యాడర్‌కు చెందిన సీనియర్ IPS అధికారి వై. పూరణ్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చండీగఢ్ సెక్టార్ 11లోని అద్దె ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక దర్యాప్తుల ప్రకారం అతను స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ఘటన పోలీసు వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. సూసైడ్ నోట్ కూడా లభ్యం కాలేదు.
చండీగఢ్ సెక్టార్ 11 పోలీస్ స్టేషన్‌కు మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక SHO , పోలీసుల టీమ్ స్పాట్‌కు చేరుకునే సరికి IPS అధికారి వై. పూరణ్ కుమార్ రక్తం మడుగులో ఉన్నారు. అతను తన అధికారిక ఆయుధంతోనే కాల్చుకున్నట్లుగా గుర్తించారు. ఫోరెన్సిక్ టీమ్ ఆయుధం, మొబైల్ ఫోన్‌లు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వై. పూరణ్ కుమార్ 2001 బ్యాచ్‌కు చెందిన హర్యానా క్యాడర్ IPS అధికారి. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) హోదాలో ఉన్నారు. ఇటీవల సెప్టెంబర్ 29న రోథక్ రేంజ్ ADGP పదవి నుంచి సునారియా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC)లో ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG)గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. సునారియా జైలు డెరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రాహిం ఉండే జైలు. పూరణ్ కుమార్ కెరీర్‌లో అనేక కీలక పదవుల్లో పనిచేశారు. 1991, 1996, 1997, 2005 బ్యాచ్‌ల IPS అధికారుల ప్రమోషన్‌లపై ప్రశ్నలు లేవనెత్తినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హర్యానా పోలీసు వర్గాల్లో అతనిని క్రమశిక్షణ, అంకితభావం కలిగిన అధికారిగా పరిగణించేవారు.
పూరణ్ కుమార్ భార్య అమ్నీత్ పి. కుమార్ సీనియర్ IAS అధికారి. ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న అధికారిక బృందంలో ఉన్నారు. భర్త ఆత్మహత్య గురించి తెలియగానే ఇండియాకు వచ్చారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఘటన జరిగినప్పుడు కుమార్తె ఇంట్లోనే ఉందని చెబుతున్నారు. పోలీసులు మొబైల్ ఫోన్‌లు, వ్యక్తిగత వస్తువులను స్కాన్ చేస్తున్నారు. సూసైడ్ నోట్ లేకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులు, సిబ్బంది వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారు. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా అని పరిశోధిస్తున్నారు. హర్యానా ప్రభుత్వం ఇంటర్నల్ రిపోర్ట్ ఆధారంగా అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని భావిస్తున్నారు.