Seeman party manifesto: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నామ్ తమిళర్ కట్చి తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ చెన్నైలోని గిండీలో ఈ నివేదికను ప్రకటిస్తూ అనేక సంచలన హామీలను గుప్పించారు. 234 నియోజకవర్గాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న సీమాన్, అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖచిత్రాన్నే మారుస్తామని హామీ వస్తున్నాయి.
సీమాన్ ఇచ్చిన హామీల్లో కీలకమైనది ఐదు రాజధానులు ఏర్పాటు చేయడం. పాలనా సౌలభ్యం కోసం 5 రాజధానులు ఏర్పాటు చేసి.. తమిళనాడు సర్వతోముఖాభివృద్ధి చేస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తిరుచ్చిని పరిపాలనా రాజధానిగా, కోయంబత్తూర్ ను వాణిజ్య రాజధాని గా.. కన్యాకుమారిని ఆధ్యాత్మిక/తత్వశాస్త్ర రాజధాని గా మారుస్తామని ప్రకటించారు. మిగిలిన రెండు నగరాలను కూడా ప్రత్యేక హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు.
కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల రద్దు
సామాజిక సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతమున్న కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తామని సీమాన్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనికి బదులుగా తమిళ పౌరసత్వ రిజర్వేషన్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. అలాగే పార్లమెంటులో మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం పోరాడతామని తెలిపారు.
రాష్ట్ర స్వయంప్రతిపత్తి - కీలక మార్పులు
రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి - కేంద్రంలో కూటమి అనే నినాదంతో సాగుతామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా రాష్ట్ర పరిధిలోని రైల్వే యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చట్టం తీసుకొస్తామన్నారు. నీటి వ్యాపారాన్ని పూర్తిగా రద్దు చేసి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా అందిస్తామని.. ప్రకృతి వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా సిద్ధ వైద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మద్యం, పొగాకు, గంజాయి , ఇతర మాదకద్రవ్యాలను రాష్ట్రం నుండి పూర్తిగా తొలగిస్తామన్నారు.
ఒంటరిగానే పోరు
తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. డిఎంకె (DMK) 21 పార్టీలతో, అన్నాడిఎంకె (AIADMK) 10కి పైగా పార్టీలతో కూటములు కట్టి బరిలోకి దిగుతుండగా.. సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీలు మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఆవిర్భావం నుండి నామ్ తమిళర్ కట్చి ఏ కూటమితో కలవకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తూ తన పంథాను కొనసాగిస్తోంది.
