Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
Scindia Asset Dispute : గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన రూ.40,000 కోట్ల ఆస్తి వివాదం సుఖాంతమైంది . జ్యోతిరాదిత్య, ఆయన మేనత్తల మధ్య నడుస్తున్న నాలుగు దశాబ్దాల నాటి కోర్టు వివాదం ఒప్పందంతో ముగిసింది.

Rajmata Vijayaraje Scindia Will Controversy: భారతదేశంలోనే అత్యంత ధనిక రాజకుటుంబాలలో ఒకటైన గ్వాలియర్ సింధియా రాయల్ ఫ్యామిలీలో గత నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్న భారీ ఆస్తి వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది. దాదాపు రూ. 40,000 కోట్ల విలువైన లగ్జరీ ప్యాలెస్‌లు, భూములు, నగలు, చరాస్తుల పంపకాలకు సంబంధించి గ్వాలియర్ జిల్లా కోర్టులో బుధవారం ఒక చారిత్రాత్మక పరస్పర ఒప్పందం కుదిరింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆయన ముగ్గురు మేనత్తలు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి యశోధర రాజె, ఉషా రాజెల మధ్య ఈ ఆస్తుల పంపకాల ప్రక్రియ న్యాయస్థానం వేదికగా అధికారికంగా పూర్తయింది. కోర్టు ఆదేశాల మేరకు ఇరుపక్షాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై, ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా ముగించేందుకు అంగీకరించారు.
ఈ హైప్రొఫైల్ ఆస్తి వివాదానికి దాదాపు 55 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1971లోనే సింధియా కుటుంబంలో ఆస్తుల విభజనకు సంబంధించి ఒక మౌఖిక ఒప్పందం కుదిరింది, ఆ తర్వాత ముంబై కోర్టు ఆర్డర్ ద్వారా అది చట్టబద్ధం అయింది. అయితే, రాజమాత విజయరాజె సింధియాకు సంక్రమించిన ఆస్తులలో ఎక్కువ భాగం ఆమె ఏర్పాటు చేసిన 15 చారిటబుల్ ట్రస్టులకు బదిలీ అయ్యాయి. ఆ తర్వాత 1990ల చివరి దశలో రాజమాత స్వయంగా పూణే కోర్టులో రెండు వేర్వేరు సివిల్ దావాలు వేశారు. అందులో ఒకటి ప్యాలెస్‌లు, భవనాలు, భూముల వంటి స్థిరాస్తుల యాజమాన్యం గురించి కాగా.. మరొకటి నగలు, నగదు వంటి చరాస్తుల హక్కుల గురించిన వివాదం.
2001లో రాజమాత విజయరాజె సింధియా మరణించిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. ముంబై కోర్టులో సమర్పించిన ఒక వీలునామా ప్రకారం.. రాజమాత ఆధీనంలో ఉన్న మెజారిటీ ఆస్తులు ఆమె కుమార్తెల పేరిట ఉన్నట్లు క్లెయిమ్ చేయడంతో, ఆ వీలునామా ప్రామాణికతపై ఇరుపక్షాలు కోర్టులను ఆశ్రయించాయి. నిజానికి ఈ వివాదం మొదట 1988-89లో జ్యోతిరాదిత్య సింధియా తండ్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మాధవరావు సింధియా , ఆయన ముగ్గురు సోదరీమణుల మధ్య ప్రారంభమైంది. అయితే, 2001లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మాధవరావు సింధియా కన్నుమూయడంతో.. ఈ చట్టపరమైన పోరాటం జ్యోతిరాదిత్య సింధియా వర్సెస్ ఆయన ముగ్గురు మేనత్తల మధ్యకు మారింది. తండ్రి పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు కూడా సమాన చట్టబద్ధమైన హక్కులు ఉంటాయనే వాదనతో ముగ్గురు మేనత్తలు గ్వాలియర్ జిల్లా కోర్టులో క్లెయిమ్ చేయగా, జ్యోతిరాదిత్య సింధియా కూడా తన హక్కులను స్పష్టం చేస్తూ విడిగా సివిల్ దావా వేశారు.
జిల్లా కోర్టులో దాదాపు 16 ఏళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ చట్టపరమైన యుద్ధం.. 2017లో సివిల్ రివిజన్ రూపంలో హైకోర్టుకు చేరింది. గత విచారణ సందర్భంగా కోర్టు ఇరుపక్షాలకు గట్టి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ వివాదాన్ని కోర్టు వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి 90 రోజుల గడువు ఇస్తూ, ఒక రాజీ ఒప్పందాన్ని సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ గడువులోగా ప్రక్రియ పూర్తికాకపోతే పిటిషన్‌ను మళ్లీ మొదటికొస్తుందని స్పష్టం చేయడంతో ఇరుపక్షాలు దిగొచ్చాయి. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కుదిరిన ఈ తాజా చారిత్రాత్మక రాజీ ఒప్పందంతో, నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్న దేశంలోనే అతిపెద్ద రాయల్ ఆస్తి వివాదానికి ఎట్టకేలకు శాశ్వత తెరపడింది.
ట్రెండింగ్ వార్తలు






















