19 th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
- అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం
- రక్షాబంధన్
ఆంధ్రప్రదేశ్ వార్తలు :
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీసిటీలో పర్యటన సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సోమశీల జలాశయ మరమ్మతు పనులపై సమీక్షించనున్నారు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం. దీనికి సంబంధించి ఈ నెల 19 నుంచి 22 వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశం కానుందని తెలుస్తోంది. నెలాఖరులోపు బడ్జెట్ అంచనాలను పంపించాలని అన్ని శాఖలకు సూచించింది. దీనిపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది.
- రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కాగా.. వర్షాకాలంలోనూ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం విశాఖపట్నం, కర్నూలు, కడప జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
తెలంగాణ వార్తలు :
- ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఉదయం అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె.కేశరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది.
- హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లో అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఉక్కుపాదం మోపింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు ఫామ్‌హౌస్‌లు, అతిథి గృహాలు, హోటళ్లను కూల్చివేసింది. ఓఆర్‌వో, ఎస్‌ఓఎస్ స్పోర్ట్స్ విలేజీల్లోని 12కు పైగా కట్టడాలతో కలిపి సుమారు 50 భవనాలను పూర్తిగా కూలగొట్టారు. ఈ క్రమంలో అధికారుల విధులకు భంగం కలిగించిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ వార్తలు:
- కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కాగా రక్షా బంధన్ వేడుకను నిరసనలకు వేదికగా చేసుకోవాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాఖీ రూపంలో నల్ల దారం కట్టి నిరసన తెలుపనున్నారు. కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రక్షాబంధన్ వేళ.. నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలియజేయనున్నారు.
- కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను దేశం మొత్తం ఖండిస్తోంది. ఈ ఘటనను నిరసిస్తూ.. ఇప్పటికే వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో దేశంలో వైద్యరంగానికి చెందిన 70 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కీలక లేఖ రాశారు. వైద్యులపై జరుగుతున్న హింసాత్మక దాడులకు అడ్డుకట్ట వేసేలా చట్టాన్ని తీసుకురావాలని అభ్యర్థించారు.
అంతర్జాతీయ వార్తలు
- రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబును నార్తర్న్ ఐర్లాండ్‌లోని కౌంటీ డౌన్ ప్రాంతంలో ఉన్న న్యూటౌనార్డ్స్‌లో గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా 400 మీటర్ల వ్యాసార్ధంలో ఉన్న ఇళ్లల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేస్తుండగా స్థానికులు దీనిని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా బాంబు అని తేలింది.
- ఇన్నాళ్లు ఉక్రెయిన్ ను భయపడుతూ వచ్చింది రష్యా. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ సింహ గర్జనతో మాస్కో వణికిపోతోంది. దండయాత్రను యుద్ధంగా మార్చి ఉగ్రరూపంలో చూపిస్తోంది ఉక్రెయిన్. రష్యా గడ్డపై బీభత్సం సృష్టిస్తోంది. జెలెన్ స్కీ దెబ్బ.. పుతిన్ అబ్బా.. అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇన్నాళ్లు దాడులను తట్టుకునేందుకు ఇబ్బంది పడిన ఉక్రెయిన్.. ఇప్పుడు ఏకంగా రష్యాలోకి చొచ్చుకు వెళ్తోంది.
క్రీడలు
- మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 18న మలేసియాలో ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. గతంలో 2023లో జరిగిన మొట్టమొదటి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రతిభ చూపిన భారత గాళ్ళు ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌కు ప్రపంచ కప్ అందించారు.