Saudi Arabia Floods: ఎడారి దేశం సౌదీ అరేబియాలో వరద పోటెత్తింది. రహదారులు జలమయమయ్యాయి. వీధులు వాగుల్ని తలపించాయి. అంతేకాదు.. బైక్‌లు, కార్లు వరదలో కొట్టుకుపోయాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. చినుకు చిత్తడితో జనజీవితం అస్తవ్యస్తమైంది.






ఆనాడు


సౌదీ అరేబియాలోని జెడ్డా నగరాన్ని అకాల వర్షాలు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. భారీగా పొటెత్తుతున్న వరదలతో జనం అల్లాడిపోతున్నారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం నాటి సీన్ మళ్లీ రిపీట్ అయింది. 2009 నవంబర్‌లో కూడా ఇలాగే వరదలు జెడ్డాను వణికించాయి. తిరిగి ఇప్పుడు మరోసారి అదే నవంబర్‌లో జెడ్డాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.






వానలే వానలు


జెడ్డా నగరంలో గ్యాప్‌ లేకుండా వాన కురుస్తూనే ఉంది. దాదాపు ఆరు గంటల్లో ఏకంగా 179 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, వీధులు జలాశయాలను తలపించాయి. అండర్‌ పాస్‌ రోడ్లపై నిలిచిపోయిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపిస్తున్నారు. భారీగా చేరిన వ్యర్థాలను తొలగించడానికి.. రవాణా వ్యవస్థను పునరుద్దరించడానికి చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇందుకోసం వేలాదిమంది శ్రమిస్తున్నారు.






అంతా బంద్


ఉద్యోగాల కోసం, అవసరాల కోసం బయటికొచ్చే వారితో ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది. పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అటు కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రం దగ్గర విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వర్షసూచనతో అధికారులు అలర్టయ్యారు.


ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని విఙ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మక్కా, థువల్, జెడ్డా, రబీగ్ గవర్నరేట్‌ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది అధికార యంత్రాంగం.


గతంలో


గతంలో 2009, 2011లో సౌదీలో భారీ వర్షాలు కురిశాయి. అయితే అప్పుడు 111.1 మిల్లీ  మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయింది. కానీ ఏకంగా 122 మంది చనిపోయారు. అయితే తాజా వరదల ధాటికి ఇద్దరు మృతి చెందారు. 


Also Read: Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్!