Sabarimala gold theft case SIT arrest Rajeevaru: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకుడు కండరారు రాజీవరును అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన అరెస్టుల్లో ఇది 11వది. ఈ వివాదం 2019లో ప్రారంభమైంది. శబరిమల ఆలయ గర్భాలయ ద్వారాలకు , ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు తాపడం చేసే పనులను అప్పట్లో చేపట్టారు. అయితే, ఆ పనుల కోసం వినియోగించిన బంగారంలో కొంత భాగం మాయమైందని, పాత బంగారు పలకలను తిరిగి అప్పగించడంలో గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ అపహరణపై అనుమానాలు వ్యక్తం కావడంతో కేరళ హైకోర్టు పర్యవేక్షణలో SIT దర్యాప్తుకు ఆదేశించింది.
శుక్రవారం ఉదయం రాజీవరును గుర్తుతెలియని ప్రదేశంలో ప్రశ్నించిన పోలీసులు, మధ్యాహ్నం ఆయనను SIT కార్యాలయానికి తరలించి అధికారికంగా అరెస్టు ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈ అరెస్టు జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితులతో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, బంగారు తాపడం పనులకు ఆయన ప్రత్యేకంగా సిఫార్సు చేయడమే కాకుండా, దేవస్థానం బోర్డు అనుమతి కోరినప్పుడు వెంటనే ఆమోదం తెలిపారని SIT గుర్తించింది.
శబరిమల ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రధాన అర్చకుడిని తంత్రి అని పిలుస్తారు. ఈ తంత్రి పదవి అనేది వంశపారంపర్యంగా వచ్చేది. ఆలయ ఆచారాలు, శాస్త్రోక్తమైన నిర్ణయాల్లో తంత్రిదే తుది నిర్ణయం. నిత్య పూజలు చేసే మేల్ శాంతిలా కాకుండా, తంత్రి ఆలయ పవిత్రతకు సంరక్షకుడిగా ఉంటారు. అటువంటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అరెస్టు కావడం భక్తులలో తీవ్ర చర్చకు దారితీసింది. కేరళ డీజీపీ రావడ చంద్రశేఖర్ స్పందిస్తూ.. హైకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందని, లభించిన సాక్ష్యాధారాల బట్టే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.