RSS Pracharak Indresh Kumar:


అవి భారత్‌లో విలీనం కావాలి: ఇంద్రేష్ కుమార్


ఆర్ఎస్‌ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. జమ్ము పర్యటనకు వెళ్లిన ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హాతో భేటీ అయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని హెల్త్ సర్వీసెస్‌ గురించి మాట్లాడిన ఆయన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కైలాశ్ మానససరోవరం ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. "కైలాశ్ మానససరోవర్‌ భారత్‌ సొంతం. అది కచ్చితంగా భారత్‌కు చెందాల్సిందే. భారత్ కోరుకునేది కూడా ఇదే" అని వెల్లడించారు. చైనాపై కూడా విమర్శలు చేశారు. "కొవిడ్ అనే వైరస్‌ను చైనా తయారు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. భారత్ మాత్రం అందరికీ రక్షణ కవచంలా నిలిచింది. చైనాకు అతి పెద్ద సవాలు ఏదైనా ఉందంటే..అది భారత్ మాత్రమే" అని స్పష్టం చేశారు. చైనాతో పాటు పాకిస్థాన్‌నూ టార్గెట్ చేశారు ఇంద్రేష్ కుమార్. "75 ఏళ్లలో పాకిస్థాన్‌లో కనీసం వారం రోజులు కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపించలేదు. ప్రజలందరికీ చెప్పేది ఒకటే. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌, కైలాశ్ మానససరోవరం భారత్‌కు చెందాలని దేవుడిని ప్రార్థించండి. ఇవి భారత్‌లో విలీనం అవ్వాలని కోరుకోండి" అని సూచించారు. ఈ సందర్భంగా...కశ్మీరీ పండిట్‌ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కశ్మీరీ నేతలు పండిట్‌ల హత్యపై నోరు మెదపటం లేదెందుకు అని ప్రశ్నించారు. వారికి పునరావాసం కల్పించే విషయాన్నీ ఎప్పుడూ చర్చించరని విమర్శించారు. పాకిస్థాన్‌లో మైనార్టీలపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. హిందువులు, సిక్కులపైనే కాకుండా ఇతర మతాలకు చెందిన వారికీ ఈ వేధింపులు తప్పడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 


రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్..


ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ సభలో పాల్గొన్నారు. భాజపా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కొంత మంది "మాకు POK కావాలి" అని నినదించారు. ఇది విన్న వెంటనే రాజ్‌నాథ్ సింగ్ నవ్వారు. "కాస్త ఓపిక పట్టండి" అని సమాధానమిచ్చారు. గిల్గిట్, బాల్టిస్థాన్‌లోనూ అభివృద్ధి సాధించిన తరవాతే POKను సొంతం చేసుకోవటంపై ఆలోచన చేస్తామని చెప్పకనే చెప్పారు. కానీ..నేరుగా దీనిపై ఎలాంటి బదులు ఇవ్వలేదు. జమ్ము, కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలైందని గుర్తు చేశారు. పీఓకేలోని ప్రజల కష్టాలు చూసి తామూ చలించిపోతున్నామని అన్న రాజ్‌నాథ్ సింగ్...ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం భారత్ మాత్రమేనని వెల్లడించారు. 


Also Read: Pakistan Army: ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్‌ ఆర్మీ సీరియస్, కఠిన చర్యలు తప్పవా?