Rs 400 cr robbery :  రెండు కంటెయినర్లలో డబ్బులు కట్టలు రవాణా చేస్తూంటారు. మధ్యలో ఓ ముఠా ఆ నోట్లను దోపిడీ చేస్తారు. ఇలాంటివి సినిమాల్లో చూస్తాం. కానీ నిజంగా కూడా జరిగింది. అయితే ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

Continues below advertisement

ఈ మొత్తం ఉదంతం 2025, అక్టోబర్ 16న ప్రారంభమైంది. కర్ణాటక నుండి గుజరాత్‌కు వెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కులు మహారాష్ట్ర-కర్ణాటక-గోవా సరిహద్దుల్లోని దట్టమైన చోర్లా ఘాట్ అడవుల్లో అదృశ్యమయ్యాయి. ఈ ట్రక్కుల్లో రద్దు చేసిన రూ. 2,000 నోట్లు సుమారు రూ. 400 కోట్ల విలువైనవి ఉన్నట్లు సమాచారం. ఆ నగదును వేరే కరెన్సీలోకి మార్చేందుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో సాయుధ ముఠా ఆ కంటైనర్లను హైజాక్ చేసి నగదును దోచుకుంది.   

ఈ భారీ దోపిడీ వెలుగులోకి రావడానికి ఒక కిడ్నాప్ కేసు కారణమైంది. ఇగత్‌పురికి చెందిన సందీప్ పాటిల్ అనే వ్యక్తిని కిషోర్ షేత్ అనే వ్యక్తి అనుచరులు తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. కంటైనర్ల చోరీకి సందీప్ పాటిల్ కారణమని ఆరోపిస్తూ, అతడిని నెల రోజులకు పైగా బంధించి, రూ. 400 కోట్లు చెల్లించాలని శారీరక, మానసిక హింసకు గురిచేశారు. అయితే, సందీప్ పాటిల్ వారి నుండి తప్పించుకుని నాసిక్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దోపిడీ వ్యవహారం బయటపడింది.

ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసింది. వీరిలో జయేష్ కడమ్, విశాల్ నాయుడు, సునీల్ ధుమాల్ వంటి వారు ఉన్నారు. విచారణలో భాగంగా థానేకు చెందిన ఒక బిల్డర్ , అహ్మదాబాద్‌కు చెందిన ఒక హవాలా ఆపరేటర్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ నగదును హవాలా మార్గాల ద్వారా మార్పిడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.            

ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక , గోవా పోలీసులు సమన్వయంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రద్దు చేసిన రూ. 2,000 నోట్లు ఇంత భారీ మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ఉధృతం చేస్తూనే, ఆ నగదును ఎక్కడికి తరలించారనే దానిపై క్లూస్ సేకరిస్తున్నారు.