CM Revanth Reddy Vs CMD Prabhakar Rao: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజే కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చలు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్లో వెల్లడించారు. అయితే, విద్యుత్ రంగంపై ఈ తొలి కేబినెట్ భేటీలో హాట్ హాట్ గా సమావేశం జరిగింది. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు.


రేపు ఉదయం విద్యుత్ శాఖపై సీఎం ప్రత్యేక సమీక్ష 
విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులు ఉన్నాయని విద్యుత్ అధికారులు సీఎంకు చెప్పారు. చివరికి ఆ సమావేశానికి తెలంగాణ ట్రాన్స్‌ కో, జెన్ కో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన ప్రభాకర్ రావును కూడా తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయన మూడు రోజుల క్రితమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రాజీనామాను ఆమోదించొద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కచ్చితంగా రేపటి రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులను ఆదేశించారు. గత పదేళ్ల కింద చేసిన ప్రతి ఖర్చు మీద శ్వేత పత్రం రూపొందించే పని మీద దృష్టి పెట్టాలని అధికారులను కోరారు.


అన్ని వివరించాకే సీఎండీ రాజీనామా ఆమోదించండి
నీకు ఇష్టమొచ్చినట్లు రాజీనామా చేసి పోతా అనేందుకు ఇది నీ.. ఇల్లు కాదు! అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖపై హాట్ హాట్ గా జరిగిన చర్చలో భాగంగా సీఎండీ ప్రభాకర్ రావును కచ్చితంగా తీసుకురావాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యుత్ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అన్ని క్లుప్తంగా వివరించాకే రాజీనామాను ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.


రేవంత్ - సీఎండీ మధ్య నాలుగేళ్ల క్రితమే గరం గరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగేళ్ల క్రితం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఆయనకు, సీఎండీ ప్రభాకర్ రావుకు మధ్య వాగ్యుద్ధమే నడిచింది. నాలుగు సంవత్సరాల క్రితం తెలంగాణ విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి పెద్ద పోరాటమే చేశారు. దానిపై నోరు విప్పాలని రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావును డిమాండ్ చేశారు. దీనిపై ప్రభాకర్ రావు రేవంత్ రెడ్డిపై పరుష పదజాలంతో సమాధానం ఇవ్వడంతో రేవంత్ రెడ్డి మరింత ఘాటుగా ప్రభాకర్ రావుపై వ్యాఖ్యలు చేశారు.


కాల్చి చంపినా తప్పులేదు - రేవంత్ రెడ్డి
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రాగా పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపేశారు. దీంతో రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్దకు చేరుకొని నిరసన చేసి, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావును కాల్చి చంపినా తప్పులేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేపటి నాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అప్పటికి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినా, లేదా చంద్ర మండలంలో దాక్కున్నా గుంజుకొని తీసుకొస్తానని, గన్ పార్క్ వద్ద మోకాళ్లతో నిలబెడతానని నాలుగేళ్ల క్రితం ప్రతినబూనారు.


ప్రభాకర్ రావు అందుకే రాజీనామా చేశారా?
సీఎం కేసీఆర్ 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి తెలంగాణ ట్రాన్స్‌ కో, జెన్ కో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ప్రభాకర్ రావు పని చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ప్రభుత్వం మారిపోతుందని ఖరారు అయిన మరుసటి రోజే ప్రభాకర్ రావు తన చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. విద్యుత్ శాఖలో అనేక అవకతవకలు ఉన్నాయని అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం కాంగ్రెస్ ఆరోపిస్తుండడం.. సరిగ్గా ఎన్నికల ఫలితాల తర్వాత సీఎండీ రాజీనామా చేయడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.


ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే నిర్వహించిన కేబినెట్ సమావేశంలో విద్యుత్ రంగంపై ప్రధానంగా ఫోకస్ చేశారు. కచ్చితంగా డిసెంబర్ 8న విద్యుత్ శాఖ అధికారులతో జరిగే రివ్యూ మీటింగ్‌కు సీఎండీ ప్రభాకర్ రావును తీసుకురావాల్సిందేనని సీఎస్ ను ఆదేశించారు. రాజీనామా ఆమోదించవద్దని గట్టిగా చెప్పారు. దీంతో ఆ శాఖలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను తవ్వి తీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆసక్తి చూపుతున్నట్లుగా అర్థం అవుతుంది.