పది లక్షల మంది భక్తులతో రథయాత్ర


ఒడిశాలో పెద్ద పండుగగా భావించే పూరి జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలో పాల్గొనేందుకు దాదాపు 10 లక్షల మంది భక్తులు ఇప్పటికే తరలి వచ్చారు. వారిని కంట్రోల్ చేయటం పోలీసులకు సాధ్యం కావటం లేదు. ఒడిశా గవర్నర్ గణేషి లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తదితరులు జగన్నాథుని రథాన్ని లాగారు. భక్తులంతా హరి బోల్ అనే నినాదాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రథానికి నమస్కరిస్తూ ప్రజలకు రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ప్రజల్ని అనుమతించకుండానే ఈ పండుగ నిర్వహించారు. ఈ సారి భక్తుల్నీ అనుమతించటం వల్ల పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నా, ఆ తరవాత ఒక్కసారిగా పెరిగింది.


ఏటా జూన్‌ లేదా జులై నెలల్లో శుక్లపక్షంలోని రెండో రోజున ఈ రథయాత్రను ప్రారంభిస్తారు. ఈ సారి ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేసిన అధికారులు, అదే స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రథయాత్ర సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం అందించాలని పూరీ జగన్నాథుడిని ప్రార్థిస్తున్నాను" అంటూ ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ.













 


ఈ ఆలయంపై ఏ పక్షీ ఎగరదట..


పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి ఓ మిస్టరీ ఎప్పటికీ అలానే ఉండిపోయింది. ఈ ఆలయంపై పక్షులు అసలు ఎగరవని చెబుతారు. జగన్నాథుడికి వాహనంగా గరుడ దేవుడు ఉంటాడని, గరుడ దేవుడే ఆలయాన్ని కాచుకుని ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే పక్షులు 
ఇక్కడ ఎగిరేందుకు భయపడతాయనీ అంటారు. ఇక విమానాలు కూడా ఈ ఆలయం మీదుగా వెళ్లవు. ఇందుకు కారణం...ఈ ఆలయం ఫ్లైయింగ్ రూట్‌లో లేకపోవటమే. అంటే ఈ ఆలయం మీదుగా ఏ మార్గానికీ వెళ్లే అవకాశం లేదు. అందుకే విమానాలు ఈ చుట్టుపక్కల కనిపించవు. ఇందుకు మరో కారణాన్ని కూడా చెబుతారు. ఆలయ శిఖరాన మెటల్‌తో తయారు చేసిన చక్రాన్ని ఉంచారు. ఇది వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను అడ్డుకుంటుంది. ఇక్కడ విమానాలు ఎగిరితే ప్రమాదాలు జరుగుతాయన్న ఉద్దేశంతోనూ ఫ్లైయింగ్ జోన్ లేకుండా చూసుకున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఆలయ శిఖరంపైన ఉండే చక్రం దాదాపు 20 అడుగులు ఎత్తుంటుంది. సిటీలో ఏ మూల నుంచి చూసినా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాదు ఆలయంపైన ఉండే జెండా, గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఊగుతూ ఉంటుంది.