Ramlala Pran Pratishtha: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని (Ayodhya Ram Mandir Opening) దేశవ్యాప్తంగా పలు చోట్ల లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో సెలవు కూడా ప్రకటించారు. అయితే..తమిళనాడు ప్రభుత్వం మాత్రం ప్రత్యక్ష ప్రసారంపై నిషేధం విధించిందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడ్డారు. యాంటీ హిందూ అంటూ విమర్శించారు. Hindu Religious and Charitable Endowments పరిధిలోని అన్ని ఆలయాల్లోనూ శ్రీరాముడి పేరిట ఎలాంటి పూజలు జరగకుండా ఆంక్షలు విధించారంటూ ఆరోపించారు. అంతే కాదు. రాముల వారి పేరు మీద ఎవరూ అన్నదానం చేయకుండా అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. ఆలయాల్లో ఎలాంటి వేడుకలు చేయొద్దని పోలీసులు నిర్వాహకులను బెదిరిస్తున్నారని, ప్రైవేట్ ఆలయాలపై ఈ ఆంక్షలు ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు.
"అయోధ్య రామ మందిర వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో దాదాపు 200 రామాలయాలున్నాయి. రాముడి పేరిట ఎక్కడా పూజలు, వేడుకలు, భజన కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇక ప్రైవేట్ ఆలయాల పరిస్థితీ దారుణంగా ఉంది. అక్కడ ఎలాంటి వేడుకలు జరగకూడదని పోలీసులు బెదిరిస్తున్నారు. ఇలాంటి వైఖరిని కచ్చితంగా ఖండించాల్సిందే. స్టాలిన్ ప్రభుత్వం హిందువుల పట్ల ఇంత విద్వేషం చూపిస్తోంది"
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
తీవ్ర అసహనం..
ఇదే విషయమై వరుస పెట్టి ట్వీట్‌లు చేశారు నిర్మలా సీతారామన్. రాముడిపై ఉన్న భక్తితో చాలా మంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నారని, పేదలకు మిఠాయిలు పంచి పెట్టాలన్నా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని మండి పడ్డారు. అంతే కాదు. లైవ్ టెలికాస్ట్ సమయంలో పవర్ కట్ చేసే అవకాశమూ ఉందని కొంత మంది కేబుల్ ఆపరేటర్స్ చెప్పినట్టు సంచలన పోస్ట్ పెట్టారు. కేవలం శాంతిభద్రతల సాకు చూపించి వేడుకలు చేయకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే..ఈ ఆరోపణలపై ఇంకా తమిళనాడు ప్రభుత్వం స్పందించలేదు.
Also Read: Ram Mandir Inauguration: అయోధ్య వేడుక సెలవుని వెనక్కి తీసుకున్న ఢిల్లీ ఎయిమ్స్, యథాతథంగా ఓపీ సేవలు