Rajinikanth releases a letter on Vijay party conduct:  సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా విడుదల చేసిన ఒక బహిరంగ లేఖ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనపై జరిగిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఈ లేఖను విడుదల చేశారు. లేఖలో ఏముంది? 

Continues below advertisement

రజనీకాంత్ తన అధికారిక లెటర్ హెడ్‌పై రాసిన ఈ లేఖలో.. ఇటీవల  తమిళ వెట్రి కళగం (TVK) పార్టీకి చెందిన ఆదవ్ అర్జున తనపై చేసిన అవాస్తవ వ్యాఖ్యలను ప్రస్తావించారు. టీవీకే పార్టీ బాధ్యతల్లో ఉన్న ఆదవ్ అర్జున ఇటీవల నాపై సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ, నాకు మద్దతుగా గళం విప్పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, అన్బుమణి రామదాస్, తిరుమావళవన్, సీనియర్ జర్నలిస్టులు నక్కీరన్ గోపాల్, రంగరాజ్ పాండే వంటి ప్రముఖుల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.   తనను కంటికి రెప్పలా కాపాడుకునే అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

ఈ లేఖ రాయడానికి కారణం ఏమిటి? 

Continues below advertisement

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టీవీకే నేత ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా వెనకడుగు వేయడంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ భయపడ్డారని,  ఎవరో ఒత్తిడి చేయడం వల్లే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారనే అర్థం వచ్చేలా ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు సమాచారం. నటుడు విజయ్ రాజకీయాల్లోకి ధైర్యంగా అడుగుపెట్టారని చెబుతూ రజనీకాంత్‌ను తక్కువ చేసి మాట్లాడటం అభిమానులను, ఇతర రాజకీయ నాయకులను ఆగ్రహానికి గురిచేసింది. రజనీ అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఆయన స్పందించారు.                                        

రజనీకాంత్ ఉద్దేశం ఏమిటి? 

ఈ లేఖ ద్వారా రజనీకాంత్ ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. లేఖ లో ఆయన పేర్కొన్న కాలం మాట్లాడదు.. కానీ వేచి ఉండి సమాధానం చెబుతుంది  అనే వ్యాక్యం ఇప్పుడు హైలైట్‌గా మారింది. తాను మౌనంగా ఉన్నానంటే అది చేతకానితనం కాదని, సరైన సమయంలో కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందనేది ఆయన అంతరార్థం.  అంతే కాకుండా, తనకు మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీల నేతలకు థాంక్స్ చెప్పడం ద్వారా.. పార్టీలకు అతీతంగా తనకు ఉన్న ప్రజాదరణను, గౌరవాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు. ఈ వివాదం ద్వారా తన అభిమానులు నొచ్చుకోకుండా చూడటంతో పాటు, అనవసర విమర్శలు చేసేవారికి సున్నితంగానే గట్టి హెచ్చరికను పంపారని తమిళ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.