Sachin Pilot on 2000 Rupee Note:


రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై విమర్శలు..


రాజస్థాన్ మాజీ డిప్యుటీ సీఎం, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై విమర్శలు చేశారు. ఈ నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు RBI ప్రకటించినప్పటి నుంచి విపక్షాలు మండి పడుతున్నాయి. దీని వల్ల ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే సచిన్ పైలట్ కూడా ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతోందని, ఇలాంటి నిర్ణయాలతో మరింత అస్యవ్యస్తం అవుతుందని అన్నారు. 


"రూ.2 వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నారు సరే..అసలు RBI ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది..? ఇందులో లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. కారణమేంటో తెలియడం లేదు. గతంలో పెద్ద నోట్ల ఉపసంహరించుకున్నప్పుడు బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చేస్తుందని చెప్పారు. విదేశాల నుంచి నల్లధనం వచ్చేస్తుందని ప్రచారం చేశారు. కానీ అది జరిగిందా..? ఇప్పుడు ఉన్నట్టుండి రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం లక్ష్యం ఏంటి..? ప్రజల్ని ఇబ్బంది పెట్టే హక్కు మీకెక్కడుంది..? ఏ మాత్రం ఆలోచించకుండా గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు"


- సచిన్ పైలట్, కాంగ్రెస్ నేత 


2016లో పెద్ద నోట్ల రద్దు 


2016 నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి వరకూ చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది మోదీ సర్కార్. ఆ తరవాతే రూ.2 వేల నోట్లు మార్కెట్‌లోకి వచ్చాయి. దేశంలో అవినీతిని అంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో ప్రకటించింది. నకిలీ నోట్ల ప్రింటింగ్‌ కూడా తగ్గిపోతుందని వెల్లడించింది. అయితే...దీనిపై భిన్న వాదనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకుందని...దీని వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శిస్తున్నాయి. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కూడా స్పందించారు. కర్ణాటకలో ఎదురైన ఓటమిని కప్పి పుచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించారు. ట్విటర్‌ హ్యాండిల్‌లో బీజేపీపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. కరెన్సీ నోట్లతో ముడి పెడుతూ ఆ పార్టీపై సెటైర్లు వేశారు. 


"500 అనుమానాలు, 1000 మిస్టరీలు, 2 వేల తప్పులు..కర్ణాటకలోని ఓటమి..వీటన్నింటినీ కప్పి పుచ్చుకునేందుకు ఒకటే ఒక ట్రిక్ ఉంది. రూ.2 వేల నోటుని రద్దు చేయడం"


- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు సీఎం