Dust Storm Rajasthan 2026:   రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఊరట లభిస్తుందనుకుంటే, ప్రకృతి ఊహించని విధంగా  ఇసుక తుపాను  రూపంలో విరుచుకుపడింది.   రాజస్థాన్‌లోని చురు జిల్లా శనివారం మధ్యాహ్నం ఒక భీకర ఇసుక తుపాను  గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా రంగు మారి, భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇసుక గోడలా విరుచుకుపడటంతో, పట్టపగలే చిమ్మచీకటి అలుముకుంది. అప్పటివరకు ఎండతో అల్లాడిన జనం, ఈ హఠాత్తు పరిణామంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గాలిలో ఇసుక రేణువుల ధాటికి వాహనదారులు కనీసం ఎదురుగా ఉన్న రోడ్డును కూడా చూడలేక వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. 

 అర్ధగంట పాటు ఇ సుక నరకం! 

ఈ ఇసుక తుపాను సుమారు 30 నిమిషాల పాటు ఏకధాటిగా కొనసాగింది. గాలి వేగం ఎంత తీవ్రంగా ఉందంటే.. రోడ్లపై వెళ్తున్న వారు ప్రాణభయంతో సమీపంలోని షాపులు, భవనాల కింద ఆశ్రయం పొందారు. దృశ్యమానత  సున్నాకి పడిపోవడంతో వాహనదారులు మధ్యాహ్నమే హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. బలమైన గాలుల ధాటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  

 మొదట దుమ్ము.. తర్వాత వర్షం! 

భయంకరమైన ఇసుక తుపాను ముగిసిన వెంటనే చురు జిల్లాలో వర్షం కురిసింది. ఆకాశం నుంచి ఇసుక వర్షం కురుస్తున్నట్లుగా వాతావరణం కనిపించింది. ఈ వర్షం వల్ల వాతావరణం కొంత చల్లబడినప్పటికీ, అంతకుముందు సంభవించిన ఇసుక తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలు కోలుకోవడానికి సమయం పట్టింది. చురుతో పాటు శ్రీగంగనగర్, జైపూర్, బికనీర్ వంటి నగరాల్లో కూడా ఇలాంటి ధూళి తుపానులు సాధారణ జీవనాన్ని అతలాకుతలం చేశాయి.

 ఎండల నుంచి  ధూళి ఉపద్రవం వైపు.. 

గత కొద్ది రోజులుగా రాజస్థాన్‌ను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చురులో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటిపోవడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. తీవ్రమైన వేడి గాలుల  కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇలాంటి సమయంలో కురిసిన ఈ ఇసుక తుపాను ప్రజలకు ఒక వింత అనుభూతిని, అదే సమయంలో భయాన్ని కలిగించింది. ప్రకృతి సృష్టించిన ఈ  బ్లాక్ అవుట్ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతం కావడంతో ఇసుక తుపానులు సహజమే అయినప్పటికీ, ఈ స్థాయిలో పట్టపగలు చీకటి అలుముకోవడం పర్యావరణ మార్పులకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఆస్తి నష్టం ,  సాధారణ జీవనానికి కలిగిన అంతరాయం ప్రజలను బెంబేలెత్తించింది. శనివారం మధ్యాహ్నం చురు వాసులకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.