రాహుల్ సరిగా సమాధానాలివ్వటం లేదు: ఈడీ అధికారులు 


నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో విచారణకు హాజరవుతున్న రాహుల్ గాంధీ, ఈడీ అడుగుతున్న ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వటంలేదనిఅధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనీలాండరింగ్ విషయమై ఎంతో ఓపిగ్గా ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ ఆయన దాటవేస్తున్నారని చెబుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా "నేను చాలా అలిసిపోయాను" అనే బదులిస్తున్నారని అంటున్నారు ఈడీ అధికారులు. 20% ప్రశ్నలకు ఇదే సమాధానం చెప్పారని వివరిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ మాటలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈడీ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు తాను ఎంతో ఓపికగా సమాధానాలిస్తున్నానని, నా సహనాన్ని చూసి వాళ్లు ఆశ్చర్యపోయారని చెప్పారు. ఈడీ అధికారులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు. విచారణకు ఆయన సరైన విధంగా సహకరించటం లేదంటూ తేల్చి చెబుతున్నారు.


కాంగ్రెస్‌పై జరుగుతున్న కుట్ర ఇది: కాంగ్రెస్ నేతలు 


అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఈడీ విచారణను కాంగ్రెస్‌పై కుట్రగా చెబుతూ కేంద్రంపై విరుచుకు పడుతున్నారు. కావాలనే రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతున్నారని విమర్శిస్తున్నారు. జూన్ 13న తొలిసారి రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరైన రోజు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇటీవల మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన శిక్షణే, తనలో ఇంత సహనం పెంచిందని, అందుకే అన్ని ప్రశల్నీ చాలా ఓపిగ్గా వింటున్నానని అన్నారు. ఆయనను గంటల తరబడి ఎందుకు విచారిస్తున్నారో కూడా కాంగ్రెస్ నేతలే వివరణ ఇస్తున్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానాలిస్తుండటం వల్లే ఇంత సమయం పడుతోందని ప్రచారం చేస్తున్నారు. రోజూ ఉదయం 11గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్తున్న రాహుల్ గాంధీ, మళ్లీ రాత్రి 11 గంటలకు బయటకు వస్తున్నారు. మధ్యలో గంట సేపు లంచ్ బ్రేక్ ఇస్తున్నారు అధికారులు. రాత్రి 11 తరవాతే ఇంటికి వెళ్తున్నారు. 


ఏంటీ నేషనల్ హెరాల్డ్ కుంభకోణం..? 


1937లో జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ అప్పట్లో ఈ పత్రికకు మార్గదర్శకత్వం చేశారు. నిజాలు బయట పెడుతున్నారన్న అక్కసుతో బ్రిటీష్ ప్రభుత్వం 1942 నుంచి 1945 వరకూ ఈ పత్రికపై నిషేధం విధించింది. అయితే ఈ పత్రికకు సంబంధించిన ఆస్తులను అక్రమంగా తమ సొంతం చేసుకున్నారని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిఫిర్యాదు చేశారు. అప్పుడే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్ గాంధీపై కేసు నమోదైంది.