Rahul Gandhi Bungalow: 


బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ 


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. అనర్హతా వేటు పడిన తరవాత ఆ బంగ్లా వదిలి వెళ్లిపోవాలని నోటీసులు అందాయి. ఈ మేరకు ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. తల్లి సోనియా గాంధీ ఇంటికి మకాం మార్చారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. నిజం మాట్లాడినందుకే తాను ఇలా మూల్యం చెల్లించుకుంటున్నానని అన్నారు. దాదాపు 19 ఏళ్లుగా ఆ బంగ్లాలో ఉంటున్నానని, ఎన్నో జ్ఞాపకాలున్నాయని చెప్పారు. 


"ఈ దేశ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. 19 ఏళ్ల పాటు ఆ బంగ్లాలో ఉండే అవకాశం ఇచ్చారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. నిజం మాట్లాడినందుకు మూల్యం చెల్లించుకుంటున్నాను. నిజం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు నేను రెడీగా ఉన్నాను"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత 






ఇదే విషయంపై ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. తన సోదరుడు రాహుల్ మాట్లాడింది అక్షరాలా నిజం అని తేల్చి చెప్పారు. 


"నా సోదరుడు రాహుల్ గాంధీ మాట్లాడింది అక్షరాలా నిజం. ప్రభుత్వం గురించి నిజం మాట్లాడాడు. అందుకే ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ నా తమ్ముడు చాలా ధైర్యవంతుడు. దేనికీ భయపడటం లేదు. తన పోరాటాన్ని కొనసాగిస్తాడు"


- ప్రియాంక గాంధీ 


AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా మండి పడ్డారు. రాహుల్‌ని కావాలనే టార్గెట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"ఇక ఈ బంగ్లాను వాళ్లు ఇంకెవరికైనా ఇవ్వచ్చు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది"


-కేసీ వేణుగోపాల్, AICC జనరల్ సెక్రటరీ


12 తుగ్లక్ లైన్‌లోని బంగ్లాను ఖాళీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకు ముందు తన ఆఫీస్‌ను మార్చేసిన రాహుల్ ఇప్పుడు పూర్తిగా బంగ్లాను ఖాళీ చేశారు. ఓ ట్రక్‌లో రాహుల్‌కి సంబంధించిన సామాన్లను సోనియా గాంధీ ఇంటికి తరలించారు. సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ పైకోర్టుకు వెళ్లినా రాహుల్‌కి షాక్ తప్పలేదు. ఆ పిటిషన్‌ను కొట్టేసింది న్యాయస్థానం. తరవాత ఏం చేయాలన్న మథనంలో పడిపోయింది కాంగ్రెస్.