Rahul Gandhi targets Central Govt over 152 paper leaks in 10 years:  దేశంలో వరుసగా జరుగుతున్న క్వశ్చన్ పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలు,  విద్యార్థుల ఆందోళనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన  ప్రస్తుత మోదీ ప్రభుత్వ హయాంలో భారత విద్యా వ్యవస్థ పూర్తిగా  ధ్వంసమై, అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. గడచిన 10 ఏళ్లలో ఏకంగా 152 పేపర్ లీకేజీలు జరిగాయని, సగటున నెలకు ఒక పేపర్ లీక్ అవుతున్నా ఇప్పటివరకు ఒక్కరిపై కూడా శిక్ష  పడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. 

Continues below advertisement

ఏడున్నర కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం

ఈ సందర్భంగా దేశంలో దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని అన్నారు.  విద్యా వ్యవస్థను సంస్కరించడానికి , నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయడానికి  మూడు స్పష్టమైన, ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు.

Continues below advertisement

 1. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామా  విద్యావ్యవస్థలోని అస్తవ్యస్తతకు, వరుస పేపర్ లీకేజీలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే ప్రధాన బాధ్యుడని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయనను అత్యంత  అసమర్థుడు , అవినీతిపరుడు గా అభివర్ణిస్తూ, ఈ సంక్షోభానికి కారణం అయిన ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

 2. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు , ప్రధాని క్షమాపణ 

శాంతియుతంగా తమ భవిష్యత్తు కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడటాన్ని రాహుల్ తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులపై దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను అణచివేసే చర్యలకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

3. విద్యా వ్యవస్థ పునర్నిర్మాణం 

దేశంలో కేవలం ధనవంతులకే చదువు దక్కేలా విద్యా వ్యవస్థ వ్యాపారీకరణ చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్   కోచింగ్ కోసమే దేశంలో ఏటా రూ. 1.32 లక్షల కోట్లు ఖర్చవుతోందని, ఇది దేశ మొత్తం విద్యా బడ్జెట్ కు దాదాపు సమానంగా ఉందని గణాంకాలతో సహా వివరించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను దూరం చేసేలా మారిన ఈ  మాఫియా ఆధారిత కొనుగోలు వ్యవస్థను రద్దు చేసి, సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కోరారు.

తనపై జరిగిన దాడి పెద్ద విషయం కాదన్న రాహుల్ 

ప్రధాని నివాసం ఎదుట జరిగిన ధర్నాలో పోలీసులు తనను నెట్టివేయడం లేదా లాఠీలతో లాగడంపై విలేకరులు ప్రశ్నించగా, రాహుల్ గాంధీ  హుందాగా స్పందించారు.  నన్ను ప్రభుత్వం ఎలా చూస్తుందనేది, కొన్ని దెబ్బలు తిన్నానా లేదా అనేది నాకు ముఖ్యం కాదు. విద్యార్థుల గొంతుకగా నిలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా వ్యక్తిగత విషయం కంటే కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు, వారి నిరసనే నేడు దేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశం అని స్పష్టం చేశారు.

ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలుస్తుందని, పేపర్ లీకేజీల మాఫియా అంతమయ్యే వరకు , అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ నిరసనలు ఆగేది లేదని హెచ్చరించారు. దేశంలోని ప్రతిభావంతులైన యువత ఆశలను ఆవిరి చేస్తున్న ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పార్లమెంట్ వేదికగానూ, రోడ్లపైనూ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని విపక్ష నేత హెచ్చరించారు.