Rahul Gandhi Calls Patriotic Indians PM House March: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల భవిష్యత్తు, ప్రశ్నాపత్రాల లీకేజీల వివాదంపై రాజకీయ రణరంగం తీవ్రస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం  ఎదుట లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకత్వం ,  వేలాది మంది విద్యార్థులతో కలిసి  రోడ్డుపైనే బైఠాయించి వినూత్న నిరసన చేపట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ప్రధానమంత్రి కార్యాలయ  సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీతో చర్చించారు. అయితే  ఆ  చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని, ఈ పోరాటం ప్రతి భారతీయుడి కుటుంబ గౌరవానికి సంబంధించినదని కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది.

Continues below advertisement

విద్యార్థులపై దాడి భారతీయ కుటుంబాలపై జరిగిన దాడి  

విద్యార్థులపై జరిగిన దాడి ప్రతి భారతీయ కుటుంబంపై జరిగిన దాడిలాంటిదని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో  విమర్శలు గుప్పించారు.  ప్రధాని మోదీ సమాధానం చెప్పకుండా, ఎటువంటి తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొనకుండా తప్పించుకోవచ్చని భావిస్తున్నారు.. కానీ ఈసారి అది ఎంతమాత్రం సాధ్యం కాదు. భారతదేశపు విద్యార్థుల గొంతును ఎవరూ తొక్కిపెట్టలేరు. విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకునే ప్రతీ దేశభక్తుడైన భారతీయుడు ప్రధాని నివాసం ముందు జరుగుతున్న ఈ ధర్నాలో భాగస్వామి కావాలి అని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.

Continues below advertisement

కేంద్రం ముందు ఐదు ప్రధాన డిమాండ్లు 

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ,  ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లను ఉంచాయి 

 మొదటి డిమాండ్: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలపై తక్షణమే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలి. రెండవ డిమాండ్: పత్రాల లీకేజీ, పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. మూడవ డిమాండ్:  నీట్, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో బాధితులైన అభ్యర్థులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి.  నాల్గవ డిమాండ్:  లోక్‌సభ , రాజ్యసభల్లో విద్యార్థుల సమస్యలు, పరీక్షల పారదర్శకతపై ప్రధాని సమక్షంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి తక్షణమే చర్చ చేపట్టాలి. ఐదవ డిమాండ్: అక్రమాలకు పాల్పడే నిందితులను శిక్షించడంతో పాటు, భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీలకు తావులేకుండా కఠినమైన జాతీయ స్థాయి చట్టాన్ని రూపొందించాలి.     

 

ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ పరిసర ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.  వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్ష నేత స్వయంగా ప్రధాని ఇంటి గేట్ల ముందే ధర్నాకు దిగడంతో ఢిల్లీ పోలీసులు, పారామిలట్రీ దళాలు భారీగా మోహరించాయి.  పార్లమెంట్, మోదీ నివాసం దగ్గర రాకపోకలను బంద్ చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రకటన చేసినప్పటికీ, విపక్షాలు మాత్రం ప్రధాని నేరుగా వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి విద్యార్థి సంఘాలు ఢిల్లీలోని నిరసనకు మద్దతుగా ర్యాలీలు తీస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో యువజన కాంగ్రెస్, విద్యార్థి సంఘాల నాయకులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాస్తారోకోలకు దిగారు. 'విద్యార్థుల ఆక్రోశం కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తోంది  అని కాంగ్రెస్ పేర్కొనగా, ఈ ఆందోళనలను రాజకీయం చేసి విద్యా వ్యవస్థను దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తోందని బీజేపీ ప్రతివిమర్శలు గుప్పించింది. రాజధాని వేదికగా సాగుతున్న ఈ పోరు రానున్న రోజుల్లో మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.         

రాహల్ పోరాటానికి తెలంగాణ సీఎం రేవంత్ మద్దతు పలికారు.