Veer Savarkar Row:


అనురాగ్ ఠాకూర్ విమర్శలు..


రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్ అయ్యారు. రాహుల్ కల్లో కూడా సావర్కర్ అవ్వలేరని సెటైర్ వేశారు. దేశంపై ప్రేమ, గౌరవం ఉన్న వాళ్లే ఆ స్థాయికి చేరుకుంటారని విమర్శించారు. బ్రిటీష్ వాళ్లకు సావర్కర్ సారీ చెప్పారంటూ గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపైనా బీజేపీ తీవ్రంగా మండి పడింది. ఇప్పుడు మరోసారి రాహుల్ సావర్కర్ ప్రస్తావన తీసుకురావడంపై విమర్శలు చేస్తోంది.


"రాహుల్ గాంధీజీ..మీరు కల్లో కూడా సావర్కర్ అవ్వలేరు. ఆయనలా అవ్వాలంటే ఎంతో అంకిత భావం ఉండాలి. దేశంపై ప్రేమ, నిబద్ధత ఉండాలి. ఎన్నేళ్లు ఎదురు చూసినా మీరు ఆ స్థాయికి ఎదగలేరు. ఆయన మీలా ఎప్పుడూ విదేశాలకు వెళ్లిపోలేదు. నా దేశంలో ధర్మాన్ని కాపాడండి అంటూ విదేశీయులను అడగలేదు. "


- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి 






భరత మాత సంకెళ్లు తెంచేందుకు రాహుల్ బ్రిటన్‌కు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు అనురాగ్ ఠాకూర్. వీర్ సావర్కర్‌పై తరచూ ఇలాంటి అభ్యంతరక వ్యాఖ్యలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ సావర్కర్‌ను ప్రశంసిస్తూ రాసిన లేఖనూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో సావర్కర్ పాత్ర ఎప్పటికీ మరిచిపోలేమని ఇందిరా గాంధీ చెప్పారంటూ ఆ లెటర్‌ను షేర్ చేశారు. 1980లో రాసిన ఈలేఖను కోట్ చేస్తూ రాహుల్‌పై మండి పడ్డారు ఠాకూర్. అంతే కాదు. ఇందిరా  గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సావర్కర్‌ను త్యాగానికి గుర్తుగా ఓ డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేశారని గుర్తు చేశారు. అంత గొప్ప వ్యక్తిని విమర్శిస్తే...తన నాయనమ్మ ఇందిరా గాంధీని విమర్శించినట్టే అవుతుందని తేల్చి చెప్పారు.  


"రాహుల్ నాయనమ్మ ఇందిరా గాంధీ సావర్కర్‌ను ప్రశంసించారు. ఆయనకు ఎంతో గౌరవమిచ్చారు. కానీ రాహుల్ మాత్రం సావర్కర్‌ను కించపరుస్తున్నారు. సావర్కర్‌ను అవమానిస్తున్నారంటే...మీ నాయనమ్మ ఇందిరా గాంధీతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌, భగత్‌ సింగ్, గాంధీజీని కూడా విమర్శిస్తున్నట్టే అని అర్థం చేసుకోండి."


- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి