Anant Radhika Wedding : ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు నిన్న (జూలై 14) మంగళ ఉత్సవ్‌తో పూర్తయ్యాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు హాజరయ్యారు.  అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 12న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. డిజైనర్ డ్రెస్ వేర్ దగ్గర్నుంచి డిన్నర్ వరకూ అన్నీ చాలా స్పెషల్. పెళ్లి జరిగిన మరుసటి రోజే 'శుభ్ ఆశీర్వాద్' వేడుక జరిగింది.


కొత్త జంటను ఆశీర్వదించేందుకు పెళ్లి రెండో రోజు జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బిహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, పశ్చిమ్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి వారు కూడా హాజరయ్యారు. నిన్న అంబానీ ఫ్యామిలీ 'మంగళ ఉత్సవ్' కార్యక్రమంతో మూడో రోజు వేడుకలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాలకు భారత్ సహా ఇతర దేశాల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.


ఖరీదైన వాచ్ లు
అయితే వివాహానికి హాజరైన తన సన్నిహితులు, బంధువులకు అనంత్ అంబానీ అత్యంత విలువైన బహుమతులను అందించారు. అడెమర్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ బ్రాండ్‌లో ఒక్కో ధర రూ. 2 కోట్ల విలువైన వాచీలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ ప్రత్యేకంగా ఈ వాచీలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఖరీదైన వాచీలను అందుకున్న వారిలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. ఆ వాచీలతో ఫొటోలు కూడా దిగారు.  అనంత్ అంబానీ కూడా తన పెళ్లిలో రూ. 54 కోట్ల ఖరీదైన వాచీ ధరించారు. 


అత్తను కొనియాడిన కోడలు
ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా ముకేశ్‌ అంబానీ తన చిన్నకుమారుడు వివాహం జరిపించారు. కొన్ని నెలల కాలంలో పలుమార్లు నిర్వహించిన వివాహ ముందస్తు వేడుకల్లో అంబానీ కుటుంబసభ్యుల దుస్తులు, నగలు ఇలా ప్రతి ఒక్కటీ ఆకర్షించాయి. అలాగే అతిథుల కోసం చేసిన ఏర్పాట్లు అబ్బురపరిచాయి. ఈ పెళ్లి ఇంత ఘనంగా జరగడం వెనక ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీదే కీలకపాత్ర. ఈ విషయాన్ని ఆమె కొత్త కోడలు రాధికనే స్వయంగా వెల్లడించింది.  ‘‘మా వెడ్డింగ్ సీఈఓ మా అత్తయ్యే. ఆమె దార్శనికత, నిబద్ధతే పెళ్లి వేడుకలు ఇంత ఘనంగా జరిగేందుకు కారణమయ్యాయి. అలాగే ఆమెకు తన వదిన ఈషా అంబానీ, తోటికోడలు శ్లోకా మెహతా ఎంతగానో సహకరించారు. ఇందుకోసం వెడ్డింగ్ ప్లానర్స్‌, మరికొంతమంది సిబ్బందిని నియమించారు. వారంతా నిరంతరం పనిచేశారు. మా ఇద్దరి జాతకాల ఆధారంగా మా పూజారి.. వెడ్డింగ్ తేదీలను నిర్ణయించారు’’ అని ప్యాషన్ మ్యాగజైన్‌ వోగ్‌తో మాట్లాడుతూ ఆమె వెల్లడించారు.


ఏడు నెలల పాటు జరిగిన వేడుకలు 
అనంత్-రాధిక వివాహ వేడుక దాదాపు ఏడు నెలల పాటు జరిగింది. 2023 జనవరిలో అనంత్‌-రాధిక నిశ్చితార్థం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 29న ఈ వేడుక రాజస్థాన్‌లో జరిగింది. ఇక్కడి నాథద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో ఈ వేడుక జరిగింది. ఈ సమయంలో అంబానీ కుటుంబ సభ్యులు, వ్యాపార కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రాధిక మెహందీ వేడుక జరిగింది. అప్పటినుంచి జామ్‌నగర్‌లో ఒకసారి, క్రూజ్‌ షిప్‌లో మరోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంబానీ కుటుంబం నిర్వహించింది. ఇక జులై నెలలో కూడా జరిగిన మరికొన్ని కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జులై 12న వివాహం, 13న శుభ్‌ ఆశీర్వాద్‌, 14న రిసెప్షన్ చాలా వైభవంగా నిర్వహించారు.  ఇక ఈ వేడుకల్లో దేశవిదేశాల ప్రముఖులు పాల్గొన్నారు.