బీజేపీ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే, దానిపై ఆ రాష్ట్ర సీఎం బఘేల్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న పురందేశ్వరి సీఎం భూపేశ్ బఘేల్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే..


ఛత్తీస్‌ గఢ్‌ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి జగదల్‌పూర్‌లో పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘చింతన్‌ శివిర్‌’ అనే కార్యక్రమ ముగింపు వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 2023లో బీజేపీని తిరిగి అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఉమ్మి వేస్తే.. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సహా ఆయన మంత్రివర్గం కొట్టుకుపోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.






అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ నాయకులు పురందేశ్వరి మాటలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ సైతం ఈ వ్యవహారంపై శుక్రవారం స్పందించారు. బీజేపీలో చేరిన తర్వాత పురందేశ్వరి మానసిక స్థాయి ఈ స్థాయికి దిగజారుతుందని తాను ఊహించలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా పురందేశ్వరి బాగానే ఉండేవారని అన్నారు. అయినా, ఆకాశంపై ఎవరైనా ఉమ్మినా అది వారి ముఖంపైనే పడుతుందని కౌంటర్ ఇచ్చారు. 






2014లో ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఛత్తీస్ గఢ్‌ను దాదాపు 15 ఏళ్లపాటు పాలించిన బీజేపీ గత 2018 ఎన్నికల్లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బఘేల్ సీఎం అయ్యారు. 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాబల్యం ఉన్న బస్తర్ ప్రాంతంలో పార్టీ ‘చింతన్‌ శివిర్‌’ పేరుతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమం సందర్భంగా పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలే వివాదానికి తెరలేపాయి.