AP Politics: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ఆమె ఏ పార్టీలో చేరితే మాకెందుకని అన్నారు. మా మాపార్టీని మేం బలోపేతం చేసుకుంటామని అన్నారు. జనసేన కీలక నేత, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ ని కలిశారు. నేడు ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర బీజేపీ కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగానే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శివప్రకాష్ ని కలిశారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు పురందేశ్వరిని ప్రశ్నించగా.. ఆమె మాట్లాడారు. షర్మిల విషయం గురించి కూడా విలేకరులు అడగ్గా.. ఆమె ఏపార్టీలో చేరినా తమకు సంబంధం లేదని అన్నారు.


‘‘జనసేన మా మిత్ర పక్షమే. నాదెండ్లతో భేటీ మర్యాద పూర్వకమే. శివప్రకాష్ జీని కలవడానికే నాదెండ్ల మనోహర్ వచ్చారు. షర్మిల ఏ పార్టీలోచేరితే మాకెందుకు. మా‌ పార్టీ బలోపేతం కోసం మేము పని చేస్తాం. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించాం. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తాం. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానానిదే’’ అని పురందేశ్వరి అన్నారు. 


నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘‘శివ ప్రకాష్ జీ అంటే మాకు ప్రత్యేక గౌరవం. మర్యాద పూర్వకంగా కలిసేందుకు ఇక్కడకి వచ్చాను. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాం. పొత్తులపై మాట్లాడే వేదిక, సమయం ఇది కాదు. మరోసారి అన్ని విషయాలు వివరిస్తా’’ అని అన్నారు.


పొత్తులపైనా చర్చలు
బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకారం అందించింది. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా ఇది తేటతెల్లం అయింది. బీజేపీ చాలా రాష్ట్రాల్లో అయిదు నుంచి 10 పర్యాయాలు అయా రాష్ట్రాల్లో గెలిస్తే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఒక్క సారి గెలవడానికి ఆపసోపాలు పడుతున్నారు. అంటే బీజేపీ ఆయా రాష్ట్రాలలో అభివృద్ధి చేసి చూపిస్తోంది. ఇక్కడ కూడా ప్రజలు ఆశీర్వదించాలి అభివృద్ధి మార్క్ చూపిస్తాం.


‘‘ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించాము. మా సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించాము. పార్టీ బలోపేతంపై ప్రధానంగా ఫోకస్ చేయాలని సూచించారు. 175 నియోజకవర్గాలలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని పరిస్థితిపై పోరాటం చేయాలని నిర్ణయించాం. బీజేపీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించాం. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. బీజేపీలో కొత్త నేతల చేరికలపై దృష్టి సారించేలా చర్చించాం. ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ  ఏర్పాటు చేశాం.


టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై సత్య కుమార్ మాట్లాడుతూ.. ‘‘పొత్తుల అంశంపై చర్చించాము. పొత్తుల నిర్ణయం మేము ఒక్కరం తీసుకునేది కాదు. మాతో పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా స్పందించాలి. పొత్తు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు  జాతీయ పార్టీతో  మాట్లాడాలి. బీజేపీని ఏపీలో బలోపేతం చేయడం మా లక్ష్యం. ఎవరు పొత్తు కోరుకున్నది వాళ్ళు ముందుకు వస్తే పొత్తులపై ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. మేం పొత్తు కోరుకున్నామా లేదా అనేది మేము ఎందుకు చెప్తాం. పొత్తులపై ఏపీ బీజేపీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది’’ అని అన్నారు.


షర్మిల కామెంట్లపై సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘‘మేధావి అన్నకు మేధావి చెల్లెలు షర్మిల. వైఎస్సార్ కారణంగానే హైదరాబాదులో మత ఘర్షణలు జరిగాయి.. దీనికి షర్మిల ఏం సమాధానం చెబుతారు..? కాంగ్రెస్ హయాంలో వేయికి పైగా ఘర్షణలు జరిగాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో ఎన్నో మత ఘర్షణలు జరగలేదా?’’ అని ప్రశ్నించారు.