Punjab woman Sarabjit Kaur deportation From Pakistan: సిక్కుల పవిత్ర యాత్ర కోసం పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడ ఒక స్థానిక వ్యక్తిని వివాహం చేసుకున్న పంజాబ్ మహిళ సరబ్‌జిత్ కౌర్‌ను పాకిస్థాన్ అధికారులు భారత్‌కు డిపోర్ట్ చేశారు. పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లాకు చెందిన సరబ్‌జిత్ కౌర్ ఉదంతం ఇప్పుడు రెండు దేశాల మధ్య చర్చనీయాంశమైంది. గతేడాది నవంబర్ 4న గురునానక్ దేవ్ 555వ జయంతి వేడుకల కోసం 1,900 మందికి పైగా సిక్కు యాత్రికులతో కలిసి ఆమె పాకిస్థాన్‌కు వెళ్లారు. అయితే, యాత్ర ముగిసిన తర్వాత నవంబర్ 13న మిగిలిన యాత్రికులంతా భారత్‌కు తిరిగి రాగా, సరబ్‌జిత్ కౌర్ మాత్రం కనిపించకుండా పోయారు. ఆమె పాకిస్థాన్‌లోనే ఉండిపోయి, అక్కడ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తేలడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సరబ్‌జిత్ కౌర్ పాకిస్థాన్‌లోని షేఖుపురా జిల్లాకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని నవంబర్ 5న వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును నూర్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. నాసిర్ హుస్సేన్‌తో తనకు తొమ్మిదేళ్లుగా పరిచయం ఉందని, గతంలో తామిద్దరం దుబాయ్‌లో పని చేస్తున్నప్పుడు కలుసుకున్నామని ఆమె పేర్కొన్నారు. గతంలో వివాహమై ఇద్దరు కుమారులు ఉన్న సరబ్‌జిత్, తన ఇష్టపూర్వకంగానే నాసిర్‌ను పెళ్లి చేసుకున్నట్లు పాకిస్థాన్ కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు. సరబ్‌జిత్ కౌర్ వివాహం చేసుకున్నప్పటికీ, ఆమె పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది కేవలం 10 రోజుల సింగిల్ ఎంట్రీ యాత్రికుల వీసాపై మాత్రమే. నవంబర్ 13తో ఆమె వీసా గడువు ముగిసింది. అప్పటి నుండి ఆమె అక్రమంగా పాకిస్థాన్‌లో నివసిస్తున్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు, జనవరి 4న నాన్కానా సాహిబ్ సమీపంలోని ఒక గ్రామంలో ఆమెను, ఆమె భర్త నాసిర్‌ను అదుపులోకి తీసుకున్నాయి. వీసా నిబంధనలు ఉల్లంఘించినందున ఆమెను భారత్‌కు బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కేసులో పలు వివాదాస్పద అంశాలు తెరపైకి వచ్చాయి. సరబ్‌జిత్ కౌర్ కుటుంబంపై గతంలో పంజాబ్‌లో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, అయినప్పటికీ ఆమెకు యాత్ర కోసం వీసా ఎలా లభించిందనే అంశంపై భారత ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. అలాగే, పాకిస్థాన్‌లో ఇమ్మిగ్రేషన్ ఫారమ్ నింపే సమయంలో ఆమె తన జాతీయత వంటి కీలక వివరాలను తప్పుగా పేర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో దర్యాప్తు సంస్థలు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది.