శ్రీలంకలో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంపై దాడి చేసి, ఆ ఇంట్లోకి చొరబడ్డారు
నిరసనకారులు. తరవాత ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ఇంటిపైనా దాడి చేశారు. ఆయన ప్రైవేట్‌ హౌజ్‌ను తగలబెట్టేశారు. విక్రమ సింఘే రాజీనామా చేయాలంటూ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే శనివారం ఆయన చేసిన ప్రకటనతో ప్రజాగ్రహం ఇంకా పెరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజీనామా చేస్తానని అన్నారు శ్రీలంక ప్రధాని. ఈ వ్యాఖ్యలతో మండిపడ్డ నిరసనకారులు, కొలొంబోలో ఉన్న ఆయన ఇంటితో పాటు ఆఫీస్‌నూ తగలబెట్టారు. ఈ దాడి సమయంలో ప్రధాని ఇంట్లోనే ఉన్నాడా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ పరిణామాలతో అటు అధ్యక్షుడు రాజపక్స కూడా రాజీనామా చేసేందుకు అంగీకరించారు. పార్లమెంట్ స్పీకర్‌ మహింద అభివర్ధనెకు లేఖ కూడా రాశారు. ఈ రాజీనామా లేఖలు రాయకముందు ఆల్‌పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమయంలో పార్టీల్నీ రాజపక్స, విక్రమసింఘే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అప్పటికే ప్రధాని ఇంటిని తగలబెట్టడం వల్ల విక్రమసింఘే కూడా వెంటనే రాజీనామా చేశారు. వీటికి ఆమోదం లభించగానే..లంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ స్పీకర్ మహింద అభివర్ధనె తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 



విక్రమసింఘే వ్యాఖ్యలు కూడా కొంత ఈ ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. "దేశంలో చమురు సంక్షోభం, ఆహార కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌తో ఈ విషయమై ఇప్పటికే చర్చిస్తున్నాం. ఐఎమ్‌ఎఫ్‌తోనూ కొన్ని అంశాలు చర్చించనున్నాం" అని వాయిస్ మెసేజ్ ఇచ్చారు విక్రమసింఘే. అయితే అంతటితో ఆగకుండా " కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ, ప్రస్తుత ప్రభుత్వం గద్దె దిగదు" అని అన్నారు. ఇదే ఇప్పుడీ పరిస్థితి దారి తీసింది.