prison officer marries prisoner: ప్రేమకు సరిహద్దులు లేవని, అది ఎక్కడైనా, ఎవరి మధ్యనైనా పుట్టవచ్చని మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. ఒకప్పుడు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ఖైదీ.. అదే జైలులో అధికారిణిగా పనిచేసిన మహిళా ఆఫీసర్ మనసు గెలుచుకున్నాడు. మతాలు, సామాజిక హోదాలు అడ్డువచ్చినా వాటన్నింటినీ అధిగమించి, సుమారు 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఆ పరిచయం.. ప్రేమగా ఎలా మారింది?
ధర్మేంద్ర సింగ్ అనే వ్యక్తి 2007లో ఒక హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి సత్నా జిల్లా జైలుకు వచ్చాడు. అదే సమయంలో ఫిరోజా బి అనే మహిళ అక్కడ జైలు అధికారిణిగా పనిచేసేవారు. విధి నిర్వహణలో భాగంగా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ధర్మేంద్ర జైలులో ఉంటూనే తన తప్పును తెలుసుకుని, ఆధ్యాత్మికత వైపు మళ్లడం, క్రమశిక్షణతో మెలుగుతుండటం చూసి ఫిరోజా ప్రభావితమయ్యారు. ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ప్రేమ అంటే బయటి సమాజం ఎలా చూస్తుందో తెలిసినా, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
14 ఏళ్ల నిరీక్షణ.. సత్ప్రవర్తనతో విడుదల
ధర్మేంద్ర జైలులో ఉన్నంత కాలం ఫిరోజా ఆయనకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. శిక్షా కాలం ముగిసే వరకూ వేచి చూడాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ధర్మేంద్ర సత్ప్రవర్తనను గమనించిన ప్రభుత్వం, సుమారు 14 ఏళ్ల తర్వాత ఆయనను జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఫిరోజా తన మాటపైనే నిలబడ్డారు. ధర్మేంద్రను పెళ్లి చేసుకోవాలని ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె కుటుంబంలో పెద్ద కలకలమే రేపింది.
ఎదురైన అడ్డంకులు.. మతాల మధ్య చిచ్చు
ఫిరోజా ముస్లిం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక మాజీ ఖైదీని, పైగా హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమకు ఇష్టం లేదని భీష్మించుక కూర్చున్నారు. కానీ ఫిరోజా తన ప్రేమ కోసం కుటుంబాన్ని కూడా కాదనుకున్నారు. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్ , బజరంగ్ దళ్ నేతలు ఈ జంటకు అండగా నిలిచారు. ధర్మేంద్ర తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా తనను రక్షించుకుంటాడనే నమ్మకంతో ఫిరోజా ముందుకు సాగారు.
హిందూ సంప్రదాయంలో వివాహం
మే 5వ తేదీన సత్నాలోని ఒక ఆలయంలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మేంద్ర, ఫిరోజా మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకలో విహెచ్‌పి నేతలు సాక్షులుగా నిలిచి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. జైలులో మొదలైన బంధం ఈరోజు పవిత్రమైన పెళ్లితో ముగియడం ఆనందంగా ఉంది అని ధర్మేంద్ర తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
