ముచ్చటగా మూడోసారి దిల్లీపీఠం కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న బీజేపీకి అన్ని అంశాలు సానుకూలంగా మారుతున్నాయి. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన బీజేపీ....రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో క్లీన్‌స్వీప్ చేయనున్నట్లు పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ తెలిపారు. అయితే ఇటీవలే నితీశ్‌తో జతకట్టి బీజేపీ తప్పు చేసిందని...ఆయనతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. నితీశ్‌కు ఇవే చివరి ఎన్నికలన్న పీకే... రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 20 సీట్లకు మించి గెలిస్తే గొప్పేనన్నారు...


బిహార్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్


లోక్ సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ హవా కొనసాగనుందని ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్ వెల్లడించారు. మొత్తం సీట్లను క్లీన్‌స్వీప్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నారు. మోదీ ఇమేజ్ బీజేపీకి కలిసిరానుండగా....ఇండియా కూటమిలో చీలికలు కమలదళానికి ప్లస్‌ కానుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతోపాటు...ఇటీవలే అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో మంచి జోష్‌మీద ఉన్న బీజీపీకి కచ్చితంగా ఇది సానుకూలంశమే. లోక్‌సభ సీట్ల సంఖ్యాపరంగా దేశంలోనే నాలుగో అతిపెద్ద రాష్ట్రమైన బిహార్‌లో అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నట్లయితే... దిల్లీ పీఠమెక్కడం ఆ పార్టీకి నల్లేరు మీద నడకే.


అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేస్తుందన్న ఊహాగానాలు నేపథ్యంలో.....ఇప్పుడు బిహార్‌లోనూ మెరుగైన స్థానాలు దక్కించుకోనుందన్న వార్తలు కమలదళంలో నూతనోత్సాహం నింపుతున్నాయి. రాజకీయ వ్యూహాకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌కు దేశంలోనే మంచి పేరు ఉంది. ఆయన చెప్పాడంటే జరిగి తీరుతుందన్న నానుడి ఉంది. గతంలోనూ NDA కూటమి తొలసారి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్‌ కిశోర్‌... ఆ తర్వాత ఏపీలో జగన్ ను అధికారంలోకి తీసుకురావడంలోనూ ఎంతో కృషి చేశారు. ఇప్పుడు బీహార్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆయన చెప్పడం కాషాయ వర్గాల్లో జోష్‌ నింపుతోంది..


నీతీష్‌కు చివరి ఎన్నికలే


బిహార్‌లో బీజేపీ జోష్‌ కొనసాగుతుందని అంచనా వేసిన ప్రశాంత్‌ కిశోర్‌...ఇటీవలే ఆ పార్టీతో జట్టు కట్టిన నితీశ్‌కుమార్‌పై మాత్రం విరుచుకుపడ్డారు. నితీశ్‌కు ఇవే చివరి ఎన్నికలన్న పీకే...ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనపడరని జోస్యం చెప్పారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి 20కి మించి సీట్లు రావని తేల్చి చెప్పారు. నితీశ్ ఏ కూటమిలో ఉన్నా ఇంతకు మించి సీట్లను సాధించలేరన్నారు. ఒక వేళ 20 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకుంటే తాను తన వృత్తిని వదులుకుంటానని ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. నితీశ్‌ను బిహార్ ప్రజలు తిరస్కరిస్తున్నారన్న పీకే.. అందుకే ఆయన కుర్చీ కాపాడుకునేందుకు కూటములు మారుతుంటారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బీజేపీకి దగ్గరైన నితీశ్‌....2025లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఖాయమన్నారు. ఏ ఒక్క కూటమిపై సంపూర్ణ విశ్వాసం ఉంచని నితీశ్ కుమార్ ను ఈసారి బిహార్ ప్రజలు విశ్వసించరని ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. నితీశ్ కు కుర్చీమీద తాపత్రయం తప్ప....ప్రజల బాగోగులు పట్టవని పీకే అన్నారు