Prashant Kishor promises to lift liquor ban in bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యనిషేధం అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మారిన రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ, రాష్ట్రంలోని మద్యనిషేధాన్ని ఎత్తివేస్తామని మరోసారి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఒక గంటలోనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఈ హామీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపింది.
బీహార్‌లో మద్యనిషేధం 2016లో ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన చట్టం. ఇది మద్యం తయారీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. కుటుంబ హింస తగ్గించడం, ఆరోగ్య సమస్యలు నివారించడం, సామాజిక మార్పు తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ చట్టం అమలు తర్వాత అక్రమ మద్యం వ్యాపారం పెరిగింది, సంవత్సరానికి రాష్ట్రానికి ₹20,000-28,000 కోట్లు ఆదాయ నష్టం ఏర్పడిందని విమర్శలు వచ్చాయి. అక్రమ మద్యం వల్ల ఏటా డజ న్లకొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి, పోలీసులు-మాఫియా కుట్రలు కూడా బయటపడుతున్నాయి.
అందుకే ఈ అంశాన్ని ప్రశాంత్ కిషోర్ ఎన్నికల హామీగా మార్చారు. జన్ సురాజ్ పార్టీ అక్టోబర్ 12, 2025న మరోసారి ఈ ప్రకటన చేసింది. పార్టీ నేత ఉదయ్ సింగ్ మాట్లాడుతూ, "మద్యనిషేధం ఒక వైఫల్య పాలసీ. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తాం" అని చెప్పారు. "నేను ముఖ్యమంత్రి అయితే, ఒక గంటలో మద్యనిషేధాన్ని ఎత్తివేస్తాను. ఇది ప్రజలకు సేవ కాదా? ఇప్పుడు అక్రమ మద్యం వల్ల పేదలు బాధపడుతున్నారు, మాఫియాలు లాభపడుతున్నారు" అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. మద్యనిషేధం ఎత్తివేతతో సంవత్సరానికి ₹28,000 కోట్లు రెవెన్యూ తిరిగి వస్తుంది. ఈ ఆదాయంతో వరల్డ్ బ్యాంక్, IMF నుంచి ₹5-6 లక్షల కోట్లు లోన్స్ తీసుకోవచ్చు. అక్రమ మద్య వ్యాపారం తగ్గుతుంది, పోలీసులు ఇతర నేరాలపై దృష్టి పెడతారని పీకే చెబుతున్నారు.
పార్టీ మేనిఫెస్టోలో ఈ హామీని "బీహార్ మోడల్"గా పేర్కొంది. మద్యం అమ్మకాలను చట్టబద్ధం చేసి, రెగ్యులేట్ చేయడం ద్వారా ఆర్థిక వృద్ధి సాధించాలని ప్లాన్. ఈ హామీపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. మహిళలు, కుటుంబాలు మద్యం ముప్పును భయపడుతున్నాయి. బీజేపీ, జేడీయూ నేతలు ఈ హామీని "ప్రజలను మోసం చేసే ప్రయత్నం" అని తిట్టారు. నీతీష్ కుమార్ మద్యనిషేధాన్ని మహిళల ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ హామీని ప్రజలు ఎలా తీసుకుంటారన్నదానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.