Prashant Kishor is using Revanth Reddys words for sentimental politics in Bihar: ఎన్నికల స్ట్రాటజిస్టు నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్‌కు.. రేవంత్ రెడ్డి ఓ ఆయుధంగా మారారు. ఆయనను చూపించి బీహార్ లో సెంటిమెంట్ రాజకీయాలు ప్రారంభించారు. రేవంత్ బీహార్ ప్రజల్ని అవమానించారని పీకే అంటున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌లో 'వోటర్ అధికార్ యాత్ర'లో పాల్గొన్నారు. అప్పటి నుంచి పీకే రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి బీహారీలను కించపరుస్తారని.. బీహార్ ప్రజల డీఎన్ఏలో కూలీ పని చేయడం ఉందని వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు.
బీహార్ వాసులపై గతంలో రేవంత్ వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీ బీహార్ నుంచి వచ్చిందని ఆరోపిస్తూ ఉంటారు. 2023 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రేవంత్ రెడ్డి ఒక మీడియా కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ "తెలంగాణ డీఎన్‌ఏ బిహార్ డీఎన్‌ఏ కంటే మెరుగైనది" అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుర్మి కులానికి చెందినవాడు, ఆ కులం బిహార్ నుండి మైగ్రేట్ అయిందని, అందువల్ల బిహార్ డీఎన్‌ఏ ఇన్‌ఫీరియర్ అని ఆయన అన్నారు. అదే సమయంలో తరచుగా కేసీఆర్ ను విమర్శించే విషయంలో 'బిహార్ DNA' వంటి పదాలు వాడతారు. దీన్ని ప్రశాంత్ కిషోర్ అస్త్రంగా చేసుకున్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా ఇంటర్యూలోనూ రేవంత్ రెడ్డిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు.
రేవంత్ మాటలతోనే ఆత్మగౌరవ అస్త్రం ప్రయోగిస్తున్న పీకే
స్ట్రాటజిస్టుగా ఎలాంటి రాజకీయాలు చేయాలో.. ఎలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టాలో బాగా తెలిసిన ప్రశాంత్ కిషోర్.. రేవంత్ మాటల్ని పదే పదే గుర్తు చేస్తున్నారు బిహార్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తన సహాయం కోరాడని, కానీ ఇప్పుడు బిహార్ ప్రజలను అవమానిస్తున్నాడని ప్రశాంత్ కిషోర్ అన్నారు. "బిహార్ ప్రజల డీఎన్‌ఏ చెత్తగా ఉంటుందని, వారు లేబర్స్‌గా మాత్రమే పనికొస్తారని అవమానించాడు. ఇలాంటి వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని పీకే ప్రకటించారు. దక్షిణాది రాజకీయాల్లో పలు సందర్భాల్లో బీహార్ ను ఉదాహరణగా చూపిస్తూంటారు. దీన్ని ప్రశాంత్ కిషోర్… తమ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి వాడుకుంటున్నారు. రేవంత్ తిరిగి వచ్చేసినా పీకే మాత్రం ఈ విషయాన్ని కాంగ్రెస్ ను కార్నర్ చేయడానికి ఉపయోగించుకుంటూనే ఉన్నారు.
బీజేపీకీ ఉపయోగపడుతున్న రేవంత్ మాటలు
ప్రశాంత్ కిషోర్ మాత్రమే కాదు.. బీజేపీ కూడా రేవంత్ మాటల్ని హైలెట్ చేస్తూ బీహార్ లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వి యాదవ్‌లు రేవంత్‌ను బిహార్‌కు తీసుకువచ్చారని.. "రాహుల్, ప్రియాంక గాంధీలు బిహార్ ప్రజలకు ఆపాలజీ చెప్పాలి" అని డిమాండ్ చేశారు. బీజేపీ స్పోక్స్‌పర్సన్ సుధాన్షు త్రివేది "రేవంత్ రెడ్డి బిహార్ డీఎన్‌ఏను ఇన్‌ఫీరియర్ అన్నాడు" అని గుర్తుచేశారు. ఈ రాజకీయం ఇంతటితో ఆగేలా లేదు.
బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. తెలంగాణ రాజకీయ నేతలకు కౌంటర్ ఇస్తూ.. రేవంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బీహార్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కాంగ్రెస్ కు సమస్యలు తెచ్చి పెడుతున్నాయి.