presidential election :  ష్ట్రపతి ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటెయ్యగా.. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.  పార్లమెంటులో దాదాపు 99.18శాతం ఓటింగ్ నమోదైంది.   బ్యాలెట్ బాక్సులను అసెంబ్లీల నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్కు తరలిస్తారు.  ఈ నెల 21న ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 


ముర్ముకు 63 శాతానికిపైగా ఓట్లు వచ్చే అవవకాశం


ఈ ఎన్నికలో మెజార్టీ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చాయి. ఆమె 63 శాతానిపైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని సమాచారం.. క్రాస్ ఓటింగ్ జరిగితే మెజార్టీ మరింత పెరిగే ఛాన్సుంది. పలు రాష్ట్రాల్లో ముర్ముకు మద్దతుగా క్రాస్ ఓటింగ్ జరిగింది.  అనేక రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేశారు. ఒడిశాలోని కటక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహ్మద్ ముకీమ్ ముర్ముకు ఓటేసినట్లు వెల్లడించారు.  ఉత్తరప్రదేశ్‌లోనూ రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. సమాజ్‌వాదీ ఎమ్మెల్యేల్లో కొందరు ముర్ముకు ఓటేశారు.  సమాజ్‌వాదీ పార్టీతో పొత్తున్న సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత ఓంప్రకాశ్ రాజ్‌భర్ కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి ముర్ముకు ఓటేశారు.  


భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ప్రచారం


కొన్ని రాష్ట్రాల్లో బయటకు తెలియకుండా క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది. పార్లమెంట్ హౌస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ప్రధాని నరేంద్ర మోడీ  తొలి ఓటు వేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు  సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్లో వచ్చి ఓటేశారు. తెలంగాణలో ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఓటింగ్‌కు రాలేదు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయారు.ఎన్నికల సంఘం అనుమతితో ఏపీ వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


ఎన్నికల ఫలితం ఏకపక్షమే!


ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఫలితం ఏకపక్షంగానే రానుందని ..  బీజేపీ వ్యూహాత్మకంగా ముర్మును అభ్యర్థిగా ప్రకటించినప్పుడే  రాజకీయవర్గాలు అంచనా వేశాయి. చాలా మంది బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. కొంత మంది పార్టీలను సైతం ధిక్కరించారు.  బీజేపీ వ్యతిరేక పక్షాల్లో  ఐక్యత లేకపోవడం కూడా ముర్ముకు కలసి వచ్చినట్లుగా భావిస్తున్నారు.