అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట్రాముడు అనే రైతును గతంలో  విచక్షణా రహితంగా  పోలీసులు చితకబాదారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనంగా మారింది. చెన్నేకొత్తపల్లి మండలం గంగనపల్లె గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా వచ్చింది. పునాదుల మట్టి విషయంలో ఏర్పడిన విభేదాలతో వెంకట్రాముడుపై నరసింహులు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా వెంకట్రామున్ని, అతని కుమారున్ని పోలీస్ స్టేషన్‌కి పిలిచారు. విచారణ పేరుతో స్టేషన్‌లోనే  స్టేషన్ ఎస్ఐ శ్రీధర్‌తోపాటు సిబ్బంది వారిని చితకబాదారు.


చిన్న వివాదం పెద్ద శిక్ష


వృద్దుడైన వెంకట్రాముడు పోలీసు దెబ్బలకు తాళలేక స్టేషన్‌లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే వెంకట్రాముడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సా విభాగంలో చేర్పించారు.


ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స 


వెంకట్రాముడిపై పోలీసులు లాఠీ చేసుకున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితున్ని పరామర్శించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. 


మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు


పోలీసులు తీరుపై వెంకట్రాముడు, అతని ఫ్యామిలీ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకునేందుకు పూర్తి స్థాయి విచారణకు మానవహక్కుల కమిషన్ ఆదేశించింది. జిల్లా ఎస్పీతోపాటు ధర్మవరం డిఎస్పీ, సిఐ, చెన్నేకొత్తపల్లి ఎస్సై, సిబ్బందికి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపట్టి ఏప్రిల్ ఆరో తారీఖున నివేదిక సమర్పించాలని డెడ్‌లైన్ పెట్టింది. 


పోలీసు వర్గాల్లో కలకలం 


జాతీయ మానవహక్కుల కమిషన్ రంగ ప్రవేశంతో జిల్లా పోలీసుల్లో కలకలం మొదలైంది. విషయం తీవ్రత తగ్గించేందుకు చెన్నేకొత్తపల్లి పోలీసులు కొత్త ఎత్తుగడ వేశారు. కమిషన్ ను ఆశ్రయించిన బాధితులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి బెదిరింపులకు దిగారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎందుకు సంతకాలు చేయాలని బాధితులు ప్రశ్నిస్తే వ్యంగ్యంగా మాట్లాడారు. ఆస్తులేమీ రాయించుకోం లే అంటూ సెటైర్లు వేశారు.


తెల్లకాగితంపై సంతకాలు


ఇదంతా అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో పోలీసులు అతి తెలివి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా పోలీసుల వైఖరిపై మండిపడుతున్నారు. మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసిన తర్వాతైనా ఖాకీల్లో మార్పు రాలేదంటు విమర్శిస్తున్నారు.