భారత ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌ లోని జగదల్‌పూర్‌లో ఎన్‌ఎండిసీ స్టీల్‌ ప్లాంట్‌ సహా దాదాపు రూ.26,000కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు మంగళవారం పునాది వేశారు. అలాగే వాటిని జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ గత రెండున్నర నెలలో నాలుగోసారి రాష్ట్రానికి వెళ్లారు. జగదల్‌పూర్‌లోని తడోకి-రాయ్‌పూర్‌ రైలు సర్వీసును కూడా జెండా ఊపి ప్రారంభించారు. మోదీ పర్యటన నేపథ్యంలో జగదల్‌పూర్‌లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 


గత ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో దేశం మొత్తం చూస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి రాజ్యమేలుతోందని మోదీ విమర్శించారు. హత్యలు, దోపిడీలు, మహిళలపై నేరాల విషయంలో ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నట్లు కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. ఛత్తీస్‌గఢ్ లో పోస్టర్లు, బ్యానర్లు, కాంగ్రెస్‌ నాయకుల ఖజానాలలో అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, నేరాలు గరిష్థ స్థాయికి చేరుకున్నాయని ఈ రెండు అంశాలలో మాత్రం రాజస్థాన్‌తో పోటీ పడుతోందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ లోక్‌తంత్రను లూట్‌తంత్రగా.. ప్రజాతంత్రను పరివార్‌తంత్రగా మార్చుతోందని దుయ్యబట్టారు.


అంతకుముందు బీజేపీ నిర్వహించిన పరివర్తన్‌ మహాసంకల్ప్‌ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో ప్రతి మూల అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశం అనే దృక్పథం నెరవేరుతుందని మోదీ అన్నారు. గ్రామాలు, జిల్లాలు అంతటా అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన భారత దేశానికి భరోసా ఇవ్వడానికి డిజిటల్‌, సామాజిక, మౌలిక సదుపాయాలు భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఉండాలని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో మౌలిక సదుపాయాల కోసం వ్యయాన్ని రూ.10 లక్షల కోట్లకు పెంచడానికి ఇదే కారణమని మోదీ స్పష్టంచేశారు. 


2014తో పోలిస్తే ఛత్తీస్‌గఢ్‌లో రైల్వే బడ్జెట్‌ దాదాపు 20రెట్లు పెరిగిందని మోదీ వెల్లడించారు. రైల్వే నెట్‌వర్క్‌ను విద్యుదీకరించిన తర్వాత రాష్ట్రంలో వందేభారత్‌ రైలు కూడా నడుస్తోందని అన్నారు. రాబోయే సంవత్సరాలలో రాష్ట్రంలోని అన్ని స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, అన్ని మంచిగా రూపుదిద్దుకుంటాయని మోదీ హామీ ఇచ్చారు. 


ప్రధాని పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని భావిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అక్కడ బంద్‌ చేపట్టింది.