PM Modi Mann Ki Baat: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత తొలిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలోనే ఆయన కీలక ప్రకటన చేశారు. తల్లిని గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. Ek Ped Maa Ke Naam పేరుతో ఓ మొక్క నాటి అమ్మపైన ప్రేమని, అభిమానాన్ని చాటుకోవాలని సూచించారు.
"మా అమ్మకు గుర్తుగా నేనో మొక్కను నాటాను. దేశప్రజలంతా ఇదే విధంగా తమ తల్లులను గౌరవించుకోండి. వాళ్లపై ప్రేమాభిమానాలను ఈ విధంగా చూపించండి"
- ప్రధాని నరేంద్ర మోదీ
వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తరవాత మొట్టమొదటి సారి మన్ కీ బాత్‌లో ప్రసంగించారు మోదీ. చివరిసారి ఫిబ్రవరి 25న ఈ కార్యక్రమం జరిగింది. ఆ తరవాత ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో NDA 292 సీట్లు గెలుచుకోగా INDIA కూటమి 232 చోట్ల విజయం సాధించింది. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు థాంక్స్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో భారత్‌లో అతి భారీ ఎన్నికల ప్రక్రియ జరిగిందని, అందుకు అందరూ సహకరించారని వెల్లడించారు. 65 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు. అరకు కాఫీ గురించి కూడా ప్రస్తావించారు మోదీ. అరకు కాఫీ అద్భుతం అని కొనియాడారు.
ఇంకేం మాట్లాడారంటే..
అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా 60 వేల అమృత్ సరోవర్స్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. Paris Summer Olympics 2024 లో పాల్గొననున్న క్రీడాకారులకు బెస్ట్ విషెస్ చెప్పారు మోదీ. త్వరలోనే వాళ్లను స్వయంగా కలుస్తానని తెలిపారు. #Cheer4Bharat పేరుతో క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కువైట్‌లోని రేడియోలో రోజూ ప్రసారం అవుతున్న హిందీ ప్రోగ్రామ్ గురించీ మోదీ ప్రస్తావించారు. అక్కడి ఇండియన్ కమ్యూనిటీలో భారతీయ సినిమాలకు ఎంతో ఆదరణ లభిస్తోందని అన్నారు. స్థానికులూ ఇక్కడి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. Kuwait Radio ద్వారా ఇదంతా సాధ్యమైందన్న మోదీ అక్కడి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న అందరినీ అభినందించారు. వర్షాకాలం గురించి మాట్లాడుతూ కేరళలో తయారయ్యే Karthumbi Umbrellas ని ప్రస్తావించారు. కేరళలోని అట్టప్పడిలో ఈ గొడుగులను గిరిజన మహిళలే తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా వీటికి డిమాండ్ పెరుగుతోందని గుర్తు చేశారు.