ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ పర్యటించారు. అలీగఢ్ లోని రాజ మహేంద్ర సింగ్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ పరికరాల నుంచి యుద్ధ విమానాల వరకు అన్నింటినీ తయారు చేసే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు.
టార్గెట్ 2022..
ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారపర్వం ఇప్పటికే మొదలైంది. 403 స్థానాలు ఉన్న ఈ ఎన్నికలను అన్నీ పార్టీలు చాలా కీలకంగా తీసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, మాయావతి, ఎఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ప్రధాని పర్యటనతో భాజపా ప్రచారశంఖారావం పూరించింది.
భాజపాను యూపీలో గద్దె దించడమే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కరోనా కట్టడిలో వైఫల్యం, మహిళలపై అత్యాచారాలు సహా మరిన్ని సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై మాయవతి, అఖిలేశ్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా యూపీ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొన్ని నెలలుగా యూపీ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. పార్టీని మళ్లీ పోటీలో నిలబెట్టేలా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. మరి ఈసారి భాజపాకు గట్టి పోటీ ఎదురవుతుందో లేక మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడుతుందో చూడాలి.