PM Modi Bajrangbali ki Jai:


కాంగ్రెస్‌కు చురకలు..


భజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించినప్పటి నుంచి బీజేపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ హిందూ వ్యతిరేకి అని మరోసారి రుజువైందంటూ మండి పడుతోంది. ఇప్పుడిదే వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సౌత్ కర్ణాటకలోని ఓ భారీ ర్యాలీలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ఈ క్రమంలోనే భజరంగ్‌బలి కీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలతో కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రసంగం మొదట్లోనే ఈ నినాదాలు చేసి ఒక్కసారిగా అందరిలోనూ ఉత్సాహం పెంచారు. ఆ తరవాత కాంగ్రెస్‌పై విమర్శల డోసు  పెంచారు. కర్ణాటకను కాంగ్రెస్ ATMలా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక ప్రజలకు ప్రశాంతత కరవవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో అభివృద్ధి సాధ్యం కాదని విమర్శించారు. డివైడ్ అండ్ రూల్‌ సిద్ధాంతాన్నే ఇప్పటికీ నమ్ముకుంటోందని ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని అక్కడి నుంచే పరిపాలన చేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"దేశంలోనే కర్ణాటకను అగ్రస్థానానికి చేర్చాలన్నదే బీజేపీ అజెండా. ఆరోగ్య రంగం, వ్యవసాయ రంగం...పారిశ్రామిక రంగం..ఇలా అన్నింటిలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్‌ చేయాలి. ఓ సూపర్‌ పవర్‌గా మార్చాలి. అటు కాంగ్రెస్ మాత్రం ఢిల్లీలో దర్జాగా కూర్చుని కర్ణాటకను ATMలా వాడుకోవాలని చూస్తోంది. తొలిసారి ఓటు వేసే వాళ్లే కర్ణాటక భవిష్యత్‌ని నిర్ణయించనున్నారు. అలాంటి వాళ్లందరికీ ఒకటే సలహా. మీకు ఉద్యోగాలు కావాలన్నా..మీకు నచ్చిన పని చేసుకోవాలన్నా బీజేపీకి ఓటు వేయండి. కాంగ్రెస్‌కు అది చేతకాదు. కర్ణాటకలో రాజకీయాలు అస్థిరంగా ఉంటే మీ భవిష్యత్‌ కూడా ప్రమాదంలో పడిపోతుంది. ప్రశాంతతకు శత్రువు ఆ పార్టీయే. అంతే కాదు. అభివృద్ధినీ అడ్డుకుంటోంది. ఉగ్రవాదులకు అండగా నిలబడుతోంది"


- ప్రధాని నరేంద్ర మోదీ
 





ప్రశాంతతను, అభివృద్ధిని కోరుకునే వాళ్లెవరైనా కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు ప్రధాని. దేశం అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేకపోతోందని విమర్శించారు. 


"మీకు ప్రశాంతత కావాలంటే కాంగ్రెస్‌ను ఓడించండి. సమాజం ప్రశాంతంగా ఉంటే కాంగ్రెస్ తట్టుకోలేదు. దేశం అభివృద్ధి చెందినా ఆ పార్టీ ఓర్వలేదు. వాళ్ల రాజకీయాలన్నీ డివైడ్ అండ్ రూల్‌ విధానంపైనే ఆధారపడి ఉంటాయి. ప్రజంలదరూ కాంగ్రెస్‌తో విసిగిపోయారని తెలుసు. దేశమంతా సైనికులను గౌరవిస్తోంది. కాంగ్రెస్ మాత్రం వాళ్లను కించపరిచే విధంగా మాట్లాడుతోంది. ఇవాళ ప్రపంచమంతా భారత్‌ను చూసి ఆశ్చర్యపోతోంది. మన ప్రజాస్వామ్య విలువలకు అన్ని దేశాలూ గౌరవమిస్తున్నాయి. కానీ రివర్స్ గేర్ కాంగ్రెస్ మాత్రం పరాయి దేశంలో మన దేశ పరువుని మంటగలుపుతోంది"


- ప్రధాని నరేంద్ర మోదీ