The Kerala Story:


బళ్లారిలో ప్రచారం 


The Kerala Story వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కర్ణాటకలోని బళ్లారిలో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన...కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఇదే సమయంలో కేరళ స్టోరీ మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగానే సినిమాను తెరకెక్కించామని దర్శక నిర్మాతలు చెబుతున్నా కాంగ్రెస్ మాత్రం బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోందని మండి పడ్డారు. ఆ పార్టీ ఉగ్రవాదులకు అండగా నిలబడుతోందని విమర్శించారు. 


"నిజ సంఘటనల ఆధారంగానే సినిమా తీశామని దర్శక నిర్మాతలు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం అది ఒప్పుకోవడం లేదు. ఉగ్రవాదుల తరపున నిలబడుతోంది. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఉగ్రవాదులు కేరళ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తున్నారో ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇదే కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టింది. ఎందుకంటే ఆ పార్టీ ఎప్పుడూ ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తుంది. సమాజాన్ని నాశనం చేస్తుంది. టెర్రరిజంతో లింక్‌లు ఉన్న వారితో చేతులు కలుపుతోంది. వాళ్లతో రాజకీయ లావాదేవేలు జరుపుతోంది"


- ప్రధాని నరేంద్ర మోదీ 






ఇదే సభలో బజరంగ్ దళ్ గురించి ప్రస్తావించారు ప్రధాని. కాంగ్రెస్ మేనిఫెస్టో ఓ అబద్ధాల పుట్ట అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పని అయిపోయిందని అన్నారు. అబద్ధపు హామీలు ఇవ్వడం తప్ప ఆ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. 


"కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో అబద్ధపు హామీలున్నాయి. అయినా ఆ పార్టీ పని అయిపోయింది. ఏం చేయాలో తెలియక కొత్త వివాదాలు తలకెత్తుకుంటున్నారు. నేను జై బజరంగ్ బలి అని నినాదాలు చేస్తుంటే కాంగ్రెస్ నేతల కాళ్లు వణికిపోతున్నాయి. ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం ఉగ్రవాదులకు అండగా నిలబడ్డారు. అలాంటి పార్టీ కర్ణాటకను కాపాడుకుంటుందని ఎలా నమ్మగలం..? ఉగ్ర అలజడితో అన్ని రంగాలూ నాశనమవుతాయి. భారీ వర్షం కురిసింది. చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా బీజేపీని ఆశీర్వదించడానికి ఇంత మంది వచ్చారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం"


- ప్రధాని నరేంద్ర మోదీ