Jammu and Kashmir Voter:
త్వరలోనే ఎన్నికలు..
జమ్ము కశ్మీర్‌లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన పూర్తైంది. దీంతో పాటు ఎన్నికల జాబితాను రివిజన్ చేస్తోంది. అయితే ఈ ఓటర్ల జాబితాని సిద్ధం చేయటం కాస్త శ్రమతో కూడుకున్న పని. అందుకే...ప్రభుత్వం ఈ ప్రక్రియను సులభతరం చేసే నిర్ణయం తీసుకుంది. జమ్ములో ఏడాది కన్నా ఎక్కువ కాలం నివసించిన వాళ్లెవరో గుర్తించి తహసీల్దార్‌లు ఓ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. తద్వారా ఓటరు జాబితాను రెడీ చేయాలని భావిస్తోంది. జమ్ము జిల్లా ఎన్నికల అధికారి, డిప్యుటీ కమిషనర్ అవ్నీ లవాసా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత ఉన్న ఉన్న ఓటర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. కొందరి వద్ద అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు లేకపోవటం మరో సమస్యగా మారింది. ఈ సమస్యలకు పరిష్కారంగానే సర్టిఫికెట్‌లు జారీ చేయాలని ఆదేశాలందాయి. అంతకు ముందుకేంద్రం..."స్థానికేతరులు" కూడా జమ్ము, కశ్మీర్‌లో జరిగే ఎన్నికల్లో ఓటు వేయొచ్చని చెప్పింది. దీనిపై స్థానిక పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.సెప్టెంబర్ 15 నుంచి ఎన్నికల జాబితాను రివిజన్ చేసే ప్రక్రియ మొదలైంది. దీని ద్వారా ఎంతో మంది కొత్త ఓటర్లు వచ్చి చేరే అవకాశాలున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వాళ్లు, చనిపోయిన వాళ్ల పేర్లను జాబితా నుంచితొలగించేందుకు వీలుంటుంది.
స్థానిక పార్టీల నుంచి వ్యతిరేకత..
అయితే...కేంద్రం ఏదైనా మానిప్యులేషన్ చేసి స్థానికేతరులకు ఓటు హక్కు ఇచ్చే ముప్పుందన్నది స్థానిక పార్టీల ప్రధాన ఆరోపణ. అందుకే... నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఓటరు జాబితాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవడమే ఈ కమిటీ పని. అంతే కాదు. కేంద్రం వైఖరిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్వీట్‌లు కూడా చేసింది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ. "కేంద్రం జమ్ముకశ్మీర్ ఓటరు జాబితాలో 25 లక్షల మంది స్థానికేతరులను చేర్చాలని చూస్తోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికలంటేనే భాజపా భయపడుతోంది. ఓటమి పాలవుతామని ఆందోళన చెందుతోంది. జమ్ముకశ్మీర్ ప్రజలు భాజపా కుట్రకు తమ ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి" అని ట్వీట్ చేసింది నేషనల్ కాన్ఫరెన్స్. భాజపా తప్ప అన్ని పార్టీలు "స్థానికేతరులకు" ఓటు హక్కు కల్పించటంపై మండి పడుతున్నాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశాక...తొలిసారి అక్కడ ఎన్నికలు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.