Israel - Hamas ceasefire: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. 15 నెలలుగా బాంబుల మోతలు, దాడులు,ప్రతిదాడులతో దద్దరిల్లిపోయిన గాజా, ఇజ్రాయెల్‌లో శాంతివనాలు చిగురించనున్నాయి. సుదీర్ఘ యుద్ధ వాతావరణానికి స్వస్తి పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రతిగా కొంతమంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించగా.. కొందరు పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ ముందుకొచ్చింది.
బాంబుల మోతలు, రాకెట్ దాడులతో కలుగుల్లాంటి సొరంగాల్లో తలదాచుకుంటున్న గాజా (Gaza)ప్రజలకు విముక్తి లభించనుంది. 15 నెలలుగా విరామం లేకుండా ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. బందీలను విడిపించుకునేందుకు టెల్‌అవీవ్(Tel Aviv) ఏకంగా ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. హమాస్ కీలక నేతలందరినీ మట్టుబెట్టిన ఇజ్రాయెల్.. బందీలుగా ఉన్న తమ పౌరులను మాత్రం విడిపించుకోలేకపోయింది. చిట్టెలుకలు దూరినట్లు హమాస్(Hamas) సేనలు సొరంగాల్లో నుంచి ఎప్పటికప్పుడు తప్పించుకుని పారిపోతున్నాయి. అదును చూసి ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు చేస్తూనే ఉన్నాయి. వీరిని ఇరాన్(Iran) అండగా నిలవడంతో ఒకానొక దశలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారి తియ్యొచ్చన్న పరిస్థితులు తలెత్తాయి. అయితే ఎట్టకేలకు ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు చల్లబడినట్లేనని యావత్ ప్రపంచం భావిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్(Khathar) మధ్యవర్తిత్వం వహించింది. కొన్ని నెలలుగా ఇరువురితో ఖతార్ శాంతి చర్చలు జరుపుతూనే ఉంది. ఈ ఒప్పందానికి మొదటి నుంచీ అమెరికా మద్దతిస్తూనే ఉంది. ఆదివారం నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు
ఇరుపక్షాల మధ్య కుదిరిన ఈ రాజీ ఒప్పందం తొలుత 6 వారాల పాటు ఉండనుంది. ఇజ్రాయెల్ బలగాలు క్రమక్రమంగా గాజాను వీడతాయి. ప్రతిగా హమాస్ చెరలో ఉన్న 100 మంది ఇజ్రాయోల్ పౌరుల్లో 33 మందిని విడిచిపెట్టాలి. దీనికి బదులుగా ఇజ్రాయెల్ సైతం కొంతమంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంటుంది..
అనుమానాలు-సందేహాలు
* తాజా ఒప్పందంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పూర్తిగా శత్రుత్వం వీడినట్లేనా అంటే చెప్పలేం. ఈ శాంతిచర్చలు యుద్ధానికి అంతం పలికినట్లేనా అంటే అవుననే సమాధానం రావడం లేదు.
* ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు నిజంగానే గాజా నుంచి పూర్తిగా వెనక్కి మళ్లుతాయా లేదా అన్న సందేహం వీడటం లేదు.
* హమాస్ అగ్రనేతలంతా అంతమైపోయిన వేళ..ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా నాశనమైన గాజా ప్రాంతాన్ని ఎవరు పాలించాలి.? పునర్నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి.
2023 అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్ సరిహద్దు దాటి ఆ దేశ పౌరులు 1200 మందిని హతమార్చాయి. మరో 250 మందిని బందీలుగా చేసుకోవడంతో యుద్ధానికి తెర లేచింది. బందీలను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడింది. హమాస్‌కు హెజ్‌బొల్లా, హుతీ ఉగ్రవాదులు మద్ధతుగా నిలిచాయి. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులు కూడా జరిగాయి. మొత్తం 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. హమాస్ అగ్రనేత ఇస్మాయెల్ హనియా, మరో కీలక నేత యహ్యా సిన్వార్‌ను హతమార్చింది.
మాటల యుద్ధం
గాజాలో యుద్ధ వాతావరణం చల్లబడిందనుకుంటుండగానే అమెరికాలో మాటల యుద్ధం మొదలైంది. హమాస్ - ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం క్రెడిట్ తనదంటే తనదంటూ ట్రంప్ - బైడెన్ పరస్పరం విమర్శించుకున్నారు. తన ప్రమాణస్వీకారం నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. అదే విధంగా నెతన్యాహూను విమర్శిస్తూ మరో వీడియో విడుదల చేశారు. దీంతో ఇరు వర్గాలపై ఒత్తిడి పెరిగిందని ట్రంప్ వర్గం ప్రకటించింది. మరోవైపు బైడెన్ సైతం తన చివరి ప్రసంగంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తన కెరీర్‌లో చేసిన కఠినమైన డీల్ ఇదేనన్నారు. తాను గత మే నెలలో ప్రస్తావించిన అంశాలే ఇప్పుడు ఈ ఒప్పందంలో ఉన్నాయన్నారు. ఈ ఒప్పందం కుదరడంలో ట్రంప్(Trump) పాత్రేమీ లేదన్నారు. అలాగే ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ సైతం ఈ ఒప్పందం కుదిర్చినందుకు జోబైడెన్(Jobiden) నాయకత్వానికి ధన్యవాదాలు తెలపడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అయితే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు మాత్రం ట్రంప్, బైడెన్ ఇద్దరికీ ధన్యవాదాలు తెలపడం విశేషం. బందీలను విడిపించడంలో కీలకపాత్ర పోషించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.